Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏపీ రాష్ట్ర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సీనియర్ నేతలను, వారి ముఖ్య కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ రాజోలులో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్టు వార్త తెలిసింది. దీంతో ఆయన హతాషుడై రోడ్డుపైనే కుప్ప కూలిపోయి అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ తన యాత్రను వెంటనే ఆపేసి, పోలీసుల అదుపులో ఉన్న చంద్రబాబు నాయుడుని చూసేందుకు విజయవాడకు బయలుదేరారు. అయితే, పోలీసు అధికారులు లోకేష్‌ను అడ్డుకుని ఆయనను చంద్రబాబును కలిసేందుకు అనుమతించలేదు. అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ తన తండ్రిని కొడుకుగా చూసే హక్కు ఉందని పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు తన అరెస్టును సిఐడి పోలీసులతో ప్రశ్నించి “చట్టవిరుద్ధం” అని అన్నారు కాగా, రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు నాయుడు పేరు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించిన వివరాలను తాము కోర్టుకు అందించామని, దాని ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), ఎం ధనుంజయుడు సీఆర్పీసీ 50(1) కింద చంద్రబాబు నాయుడుకు నోటీసులు అందించారు. 120(బి), 166, 167, 418, 420, 468, 465, 471, 409, 201, 109 రీడ్ విత్ ఐపిసి 34, 37 సెక్షన్ల కింద నమోదైన క్రైమ్ నంబర్ 29/2021లో చంద్రబాబును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 12, 13(2) అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(సి)&(డి) కింద కేసులు పెట్టినట్టు తెలిపారు.