https://oktelugu.com/

Vangaveeti Radha : వంగవీటి రాధాకు పదవి.. యువ నేత నారా లోకేష్ భరోసా!

నారా లోకేష్ టిడిపి యువ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. తాను పాదయాత్ర చేసినప్పుడు సైతం యువ నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అందులో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న రాధాకృష్ణను పరామర్శించారు లోకేష్. ఆయన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 23, 2024 / 10:20 AM IST

    Vangaveeti Radha

    Follow us on

    Vangaveeti Radha : వంగవీటి రాధాకృష్ణ.. రెండు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధా. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. మరో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. మరో రెండు ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. స్వల్ప గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి యువ నేత, మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన లోకేష్ రెండు రోజులు పాటు అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. అమరావతికి తిరిగి వచ్చే క్రమంలో రాధాకృష్ణను పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరోగ్యం గురించి ఆరా తీయడంతో పాటు కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం విశేషం.

    * 2004లో ఎంట్రీ
    2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాధా. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అతి తక్కువ వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోయారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో టిడిపిలో చేరారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కానీ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రాధా చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించింది.

    * అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక
    కూటమి అధికారంలోకి రావడంతో రాధాకు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయానికి ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. రాధా కృషికి తగ్గట్టు మంచి పదవి ఇస్తారని కూడా తెలుస్తోంది. తాజాగా సైతం రాధా పేరును పరిశీలనలోకి తీసుకున్నారని.. కీలక పదవి కేటాయిస్తారని కూడా టాక్ నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో నారా లోకేష్ రాధాకృష్ణను పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో రాధాకు పదవి ఖాయమని ప్రచారం ఊపందుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.