Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభమైంది. గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈనెల 25 వరకు ఇది కొనసాగనుంది. తొలిరోజే చాలామంది నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వారంపరంగా గురువారం రావడం.. తిధిపరంగా దశమి కావడంతో ఎక్కువమంది నాయకులు నామినేషన్ వేసేందుకు ఉత్సాహం చూపారు. వీరిలో చాలామంది పార్టీల కీలక నాయకులు ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే నామినేషన్ వేసిన తొలి నేతగా సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిలిచారు. ఆయనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి దాదాపు 40 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.అటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈనెల 25 వరకు సమయం ఉండడంతో.. భారీ జన సమీకరణ నడుమ నామినేషన్ దాఖలు చేస్తామని ఎక్కువమంది భావించారు.రేపు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించి టిడిపి నుంచి మొదటి నామినేషన్ దాఖలు అయింది. కడప నుంచి టిడిపి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి తొలి నామినేషన్ దాఖలు చేశారు. అటు తర్వాత విజయనగరం ఎంపీ స్థానానికి సంభాన శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈయన యుగ తులసి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం విశేషం. అదేవిధంగా విశాఖపట్నం స్థానానికి ఇండిపెండెంట్గా వడ్డీ హరి గణేష్ నామినేషన్ వేశారు.పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపు 100కు పైగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది.ప్రధాన పార్టీల నుంచిఎక్కువమంది బరిలో దిగుతుండగా.. చిన్నాచితకా పార్టీల నుంచి పోటీ చేసి ఉనికి చాటుకునేందుకు మరి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.