Lok Sabha Election 2024: సాధారణంగా ఎన్నికలంటేనే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు, విపక్షాల తీరుపై అధికార పక్షం ఎండగట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏపీలో ఈ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఎన్నడూ లేని సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. ఒకప్పుడు మేం అభివృద్ధి చేస్తామంటే.. ఏం చేస్తామంటూ అధికార, విపక్షాలుపోటీ పని ప్రచారం చేసుకునేది. కానీ ఈ దఫా ఎన్నికల్లో ఏపీలో నేరాలు, హత్యలు, అవమానాల సెంటిమెంట్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. వాటినే ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు.
ప్రస్తుతం ఏపీ అభివృద్ధి, సమస్యలపై 10 శాతం మాత్రమే ప్రచారం చేస్తున్నారు.మిగతా ప్రచారం అంతా నేరాలు,హత్యలు,అవమానాలు చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా ఈ అంశాలనే విపక్షాలు హైలెట్ చేస్తున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నాయి. మా బాబాయిని హత్య చేసిన వారికి ఓటేస్తారా? అంటూ షర్మిల.. నా తండ్రిని చంపిన వారికి ఓటేస్తారా? అంటూ సునీతలు ప్రచారం చేస్తున్నారు. ఏ వేదికపై అయినా షర్మిల బాబాయ్ హచ్ పైనే మాట్లాడుతున్నారు. సునీత సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీనినే వివరిస్తున్నారు. ఒకవేళ కడప బయట షర్మిల మాట్లాడితే అనంతపురం తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనను, డాక్టర్ సుధాకర్ పై పోలీసుల అనుచిత ప్రవర్తనను ప్రస్తావిస్తున్నారు. వాటిని ప్రచార అస్త్రాలుగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు.
చంద్రబాబుతో పాటు పవన్ సైతం.. గత ఐదు సంవత్సరాలుగా తమకు, తమ కుటుంబ సభ్యులకు ఏ విధంగా అవమానాలు జరిగాయో చెప్పుకొస్తున్నారు. నిండు సభలో తన భార్యనుతిట్టారని,అవమానించారని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీనినే ప్రస్తావిస్తున్నారు. తన సోదరి నారా భువనేశ్వరుని అడ్డంగా విమర్శించిన వారికి ఓటుతో జవాబు చెప్పాలని కోరుతున్నారు. రాష్ట్రంలో రౌడీ, మాఫియా పెరిగిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో శాంతిభద్రతలు దిగజారాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ విమర్శించారు.
అటు జగన్ సైతం అభివృద్ధి గురించి ప్రస్తావించడం లేదు. కేవలం సంక్షేమ పథకాల గురించి ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యర్థులంతా కలిసిపోయారని.. తనపై యుద్ధానికి వస్తున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ ఏ పార్టీ నిర్దిష్టంగా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడం లేదు. ప్రత్యేక హోదా సాధిస్తామని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా చూస్తామని, కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని.. వంటి ప్రకటనలకు పార్టీలు దూరంగా ఉన్నాయి. కేవలం నేరాలు, ఘోరాలు, వ్యక్తిగతంగానే అందరూ మాట్లాడుతున్నారు.