Kondaveedu Express Train: ఓ ప్రయాణికుడి కోసం రైలు వెనక్కి వెళ్ళింది. ఒకటి కాదు రెండు మీటర్లు కాదు.. ఏకంగా కిలోమీటర్ కు పైగా వెనక్కు వెళ్లడం విశేషం. ఈ ఘటన ఇప్పుడు చర్చకు దారితీసింది. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు కు చెందిన కమల కంటి హరిబాబు, మావో బాబు, వెంకటేశ్వర్లు, విమల రాజు బెంగళూరులో పని చేసేందుకు బయలుదేరారు. గుంటూరులో కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కారు. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర ఇందులో హరిబాబు అనే వ్యక్తి భోజనం చేశాడు. తరువాత వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని.. డోర్ వద్ద నిలబడ్డాడు. రైలు కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అయితే ప్రయాణికులు గమనించి మిగతా ఆ ముగ్గురికి సమాచారం అందించారు. అప్పటికే రైలు కిలోమీటర్ కు పైగా వెళ్ళిపోయింది.
* చైన్ లాగడంతో నిలిచిన రైలు..
ఏం చేయాలో తెలియని హరిబాబు స్నేహితులు రైలు చైన్ లాగారు. హరిబాబు కింద పడిపోయిన విషయాన్ని లోకో పైలట్లకు తెలిసింది. వెంటనే గుంటూరు రైల్వే అధికారుల అనుమతి తీసుకుని రైలును ఏకంగా 1.5 కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్లారు. అక్కడ పట్టాల పక్కన పడి ఉన్న హరిబాబును గుర్తించారు. అతడి సహచరులు హరిబాబును అదే రైలులో ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్ కు తరలించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.
* లోకో పైలట్లకు అభినందన..
అయితే ఒక ప్రయాణికుడిని కాపాడాలనే ఉద్దేశంతో రైలును ఏకంగా 1.5 కిలోమీటర్లు వెనక్కి నడపడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే రైల్వే డ్రైవర్లు చేసిన ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సాధారణంగా నిమిషం ఆలస్యం అయినా.. ఎంతటి ప్రమాదం ఎదురైనా రైలును నిలపరు. అటువంటిది ఒక ప్రయాణికుడి కోసం రైలును వెనక్కి తీసుకెళ్లారంటే ఎంతటి సాహస ప్రయత్నమో తెలుస్తోంది. కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అయితే ఉపాధి కోసం వెళ్లిన హరిబాబు అర్ధాంతరంగా చనిపోవడంతో సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు స్వగ్రామానికి తీసుకెళ్లారు.