CM Ramesh: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రసవత్తర పోరు సాగుతోంది. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ రచ్చ ప్రారంభమైంది. ఇప్పటివరకు విశాఖ పార్లమెంట్ స్థానంలో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ నడిచేది. కానీ సుదీర్ఘకాలం నాన్ లోకల్ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. వారిని విశాఖపట్నం ప్రజలు ఆదరించేవారు. ఇప్పుడు ఆ వంతు అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి వచ్చింది. 2014 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి వైయస్ విజయమ్మ పోటీ చేశారు. ఉత్తరాంధ్రలో సీమ సంస్కృతి అంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. దీంతో ఆమెను ప్రజలు ఆదరించలేదు. ఇప్పుడు అనకాపల్లిలో సైతం ఈ తరహా ప్రచారం జరుగుతోంది. కడపకు చెందిన సీఎం రమేష్ పోటీ చేయడంతో ఆయన ప్రత్యర్థులు నాన్ లోకల్ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ విశాఖ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు.దీంతో అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఆదరిస్తారో చూడాలి.
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1962 ఏర్పడింది. ఇప్పటివరకు 15 ఎన్నికలు జరిగాయి. ఇందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు తెలుగుదేశం, ఒకసారి వైసీపీ విజయం సాధించాయి. 1962, 1967లో కాంగ్రెస్ తరపున విస్సుల సూర్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు. 1971, 1977, 1980 లో జరిగిన ఎన్నికల్లో ఎస్సార్ ఏ ఎస్ అప్పలనాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1984లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున పెతకం శెట్టి అప్పల నరసింహ ఎన్నికయ్యారు. 1989, 1991 లో కాంగ్రెస్ నుంచి కొణతాల రామకృష్ణ, 1996లో టిడిపి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, 1998లో కాంగ్రెస్ నుంచి గుడివాడ గురునాథరావు, 1999లో టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు, 2004లో టిడిపి నుంచి పప్పల చలపతిరావు, 2009లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి, 2014లో టిడిపి నుంచి అవంతి శ్రీనివాస్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీసెట్టి వెంకట సత్యవతి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ పోటీ చేసిన నాయకులంతా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినవారే. తొలిసారిగా నాన్ లోకల్ అయిన బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కూటమి అభ్యర్థిగా బిజెపి తరఫున సీఎం రమేష్ బరిలో నిలిచారు. ఈయన కడప జిల్లాకు చెందిన ఓసి వెలమ. ఈ తరుణంలో సీఎం జగన్ వ్యూహం మార్చారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును రంగంలోకి దించారు. ఎలాగైనా తమ సీటు పదిలం చేసుకోవాలని వైసిపి ఎత్తులు వేస్తోంది. టిడిపి,జనసేన,బిజెపి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయిలో బిజెపికి బలం అంతంత మాత్రమే. జనసేనకు మంచి క్రేజ్ ఉంది. ఆపై క్షేత్రస్థాయిలో టిడిపికి బలమైన కేడర్ ఉంది. బిజెపిలో ఉన్న టిడిపి సన్నిహిత నేతల్లో సీఎం రమేష్ ఒకరు. అందుకే టిడిపి శ్రేణులు ఇక్కడ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ బలమైన అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఉన్నారు. అటు నియోజకవర్గంలో కొప్పల వెలమ సామాజిక వర్గం అధికం. అయితే మరోవైపు అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, పీలా గోవింద సత్యనారాయణ ఏకతాటి పైకి రావడం కూటమి అభ్యర్థులకు అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. అయితే వైసిపి లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ సెంటిమెంట్ ను లేవనెత్తింది. 2014లో విజయమ్మ పోటీ చేసినప్పుడు సీమ సంస్కృతి అంటూ టిడిపి ఆరోపణలు చేసింది. ఇప్పుడు అనకాపల్లిలో వైసిపి అవే ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో సీఎం రమేష్ గెలిస్తే రికార్డ్ బ్రేక్ చేసినట్టే. లోకల్ పై నాన్ లోకల్ విజయం సాధించినట్టే. విశాఖ పార్లమెంట్ స్థానంలో నమోదైన ఈ రికార్డును అధిగమించిన వారు అవుతారు. అయితే అనకాపల్లిలో గతంలో నాన్ లోకల్స్ గెలిచిన దాఖలాలు లేవు. దీంతో అనకాపల్లి పైనే అందరి దృష్టి ఉంది. మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.