Local body elections 2026: ఏ రాజకీయ పార్టీ కైనా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు ముఖ్యం. వారిని విస్మరిస్తే మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. ఓవైపు వాలంటీర్లు, మరోవైపు సచివాలయాలు, ఇంకోవైపు ఐపాక్, ఆపై సోషల్ మీడియా.. వీటినే నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను విడిచిపెట్టారు. దాని మూల్యం చెల్లించుకున్నారు మొన్నటి ఎన్నికల్లో. అయితే అదే తప్పిదం వద్దని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతున్నారు కూటమి పార్టీల శ్రేణులు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు అయితే.. తొలి ప్రాధాన్యం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. మలి ప్రాధాన్యం కూటమి శ్రేణులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అగ్ర తాంబూలం ఇవ్వాలని కోరుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు..
వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్( Election Commission) కసరత్తు ప్రారంభించింది. ఈ తరుణంలో అన్ని పార్టీల్లో ఆశావహుల సందడి ప్రారంభం అయ్యింది. ఎవరికి వారే ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. అయితే చాలామంది ఇతర పార్టీల నుంచి టిడిపిలో చేరిన వారు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పొత్తులో భాగంగా మూడు పార్టీల నేతలు పదవులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం చాలామంది నేతలు టిడిపిలో చేరారు. జనసేనతో పాటు బిజెపిలో చేరిన వారు కూడా ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. ఎన్నికలకు ముందు వైసీపీ ఓటమి ఊహించి వచ్చిన వారికి.. స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి.. పార్టీ జెండా పట్టి తిరిగిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అలా జరగకుంటే పార్టీకి నష్టం తప్పదని ఇప్పటినుంచే హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిసిన నాటి నుంచి.. సోషల్ మీడియా వేదికగా టిడిపి నేతలు సొంత పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అటు తరువాత కూటమి పార్టీలకు ప్రయారిటీ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నాడు ఏకగ్రీవాలే అధికం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఏకగ్రీవాలు జరిగాయి. చివరకు జడ్పిటిసిలను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు.. పార్టీకి ఎన్నికల్లో బాగా మైనస్ చేసింది. అప్పట్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అప్పటి ఎమ్మెల్యేలు ప్రాధాన్యమిచ్చారు. తమకంటూ ఒక సొంత వర్గం తయారు చేసుకోవాలన్న ఆలోచనలో అప్పట్లో అలా చేశారు. దీంతో నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఇది రుచించలేదు. అప్పటికే వాలంటీర్ సిస్టంతో వైసీపీ నాయకులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోవడంతో ఆవేదనతో ఉండేవారు. దీనికి తోడు స్థానిక సంస్థల్లో తమకు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ అప్పటివరకు ఇతర పార్టీల్లో ఉన్నవారు వైసీపీలో చేరి అవకాశాలను ఎగురేసుకుపోయారు. దీంతో తీవ్ర నైరాస్యంలో కూరుకుపోయారు వైసీపీ శ్రేణులు. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో కనిపించింది. పార్టీ దారుణ పరాజయానికి కారణం అయింది.
వివిధ కారణాలతో జంప్..
2024 ఎన్నికలకు ముందు చాలామంది వైసిపి నేతలు టిడిపిలోకి వచ్చారు. జనసేనలో ఎక్కువ శాతం వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరింది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత సైతం చాలామంది ఈ మూడు పార్టీల్లో చేరారు. కేసుల భయంతో కొందరు.. అవినీతి కేసులు ఎదురవుతాయని మరికొందరు.. ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు ఇంకొందరు.. ఇలా చాలామంది చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో వారంతా ఇప్పుడు పదవుల కోసం సిద్ధపడుతున్నారు. దీంతో ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన వారికి మాత్రమే అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టాలని సోషల్ మీడియా వేదికగా చాలామంది విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. మరి వీరి విన్నపాలను హై కమాండ్ పరిగణలోకి తీసుకుంటుందో? లేదో? చూడాలి.