AP Local Body Elections: ఏపీలో( Andhra Pradesh) మరో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయితీ రాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించాలని ఆ లేఖలో కోరారు. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ తో ముగియనుంది. మార్చిలో మున్సిపాలిటీలకు సంబంధించి పాలకవర్గాల పదవి కాలం ముగియనుంది. అయితే ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 లో ఉంది. అందుకే జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది.
Also Read: సో ఇప్పుడు ఆ డిజిటల్ పేపర్ కూడా చదివేవాడు లేడు.. పాపం ఆ యాజమాన్యానికి సినిమా అర్థమైంది..
* ఏర్పాట్లు ప్రారంభం..
తక్షణం ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభిస్తే.. జనవరి నాటికి నిర్వహణ సాధ్యమవుతుందని ఎన్నికల కమిషన్( Election Commission) భావిస్తోంది. అక్టోబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకాన్ని చేపట్టాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్, అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా చేయాలన్నది ఎన్నికల కమిషన్ ప్రణాళిక.
* ఆ కారణంతోనే..
మరోవైపు జూలైలో ఎంపీటీసీ/ జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అయితే అభివృద్ధి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల విషయంలో పంచాయతీల్లో ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో పనులకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కావడంతో అడ్డుపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా కొత్త పాలకవర్గాలను తెచ్చి.. అభివృద్ధి పనులను పరుగులెత్తించాలని ప్రభుత్వం భావిస్తోంది.