Prajagalam: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. అన్ని రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. జగన్ సిద్ధం సభలతో విపక్షాలకు సవాల్ విసిరారు. దానికి కౌంటర్ గా టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించాయి. చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైకి వచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుతో ప్రధాని మోదీ వేదిక పంచుకున్నారు. మూడు పార్టీలకు చెందిన లక్షలాదిమంది జనాలు తరలివచ్చారు. అయితే ఇంత చేసినా సభ సమన్వయంలో నిర్వాహకులు ఫెయిలయ్యారు. అది స్పష్టంగా కనిపించింది. సరిగ్గా నిర్వహించలేకపోయారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి సభ తెరపైకి వచ్చింది. అయితే అప్పటికే టిడిపి, జనసేన సంయుక్తంగా సభను నిర్వహించడానికి ప్లాన్ చేశాయి. బిజెపి కూటమిలోకి రావడంతో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయ్యింది. దీంతో మూడు పార్టీల నాయకులతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల సమన్వయ బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నారు. అయితే సభా ప్రాంగణ నిర్వహణ, ప్రధాని మోదీ ఆత్మీయ సత్కారం, స్వాగత ఉపన్యాసం, సౌండింగ్ నిర్వహణ.. ఇలా అన్నింటిలో లోపాలు వెలుగు చూశాయి. తొలి ఎన్నికల ప్రచార సభలోనే వైఫల్యాలు బయటపడ్డాయి. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది.
ప్రధాని మోదీని చంద్రబాబు సత్కరిస్తారని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వారు చెప్పగా.. అక్కడ ఏర్పాట్లు చేయలేదు. పవన్ బొకే అందిస్తారని చెప్పగా.. అది కూడా జరిగేందుకు ఆలస్యం అయ్యింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తరచూ మైకు మొరాయించింది. ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది.అందరిలోనూ అసహనం పెరిగింది. అటు సభా ప్రాంగణంలో కొంతమంది కార్యకర్తలు ఏకంగా లైట్ టవర్లను ఎక్కారు. ప్రమాదకరంగా నాయకులను చూసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రధాని మోదీ కలుగ చేసుకోవాల్సి వచ్చింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి పవన్ ప్రసంగిస్తున్నప్పుడు మైక్ వద్దకు వచ్చారు. అందర్నీ కిందకు దిగాలని కోరారు. ముఖ్యంగా పోలీసులు సైతం సమన్వయం లేదు. దీంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే మొత్తానికైతే తొలి సభలో సమన్వయలేమి స్పష్టంగా కనిపించింది. జనాలు భారీగా హాజరైనా.. సభ నిర్వహణలో లోపం వెలుగు చూసింది. మిగతా సభల విషయంలో ముందుగా జరిగిన ఈ సభ ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. మరోసారి ఈ వైఫల్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆ మూడు పార్టీలపై ఉంది.