AP Land Registrations : కంప్యూటర్ అన్నాక సాంకేతిక సమస్యలు..ఆన్ లైన్ అన్నాక సర్వర్ సమస్యలు సర్వసాధారణం. వాటికి ఇట్టే పరిష్కారమార్గం ఉంటుంది. అందుకు ఒక వ్యవస్థే పనిచేస్తుంటుంది. సర్వర్ సమస్య వస్తే రెండు, మూడు గంటల్లో రెక్టిఫై చేసే అవకాశం ఉంది. కానీ ఏపీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మాత్రం రోజుల తరబడి సర్వర్ సమస్య వెంటాడుతోంది. మరో రెండురోజుల్లో భూముల ధర పెంపునకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పుడు సర్వర్ సమస్య అంటూ పాతకాలం నాటి మాన్యువల్ రీతిలో రిజిస్ట్రేషన్లకు సిద్ధపడుతుండడం అనుమానాలకు తావిస్తోంది.
దాదాపు పదేళ్లుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. అంతకు ముందు మాత్రం మాన్యువల్ లోనే జరిపేవారు. ఆన్ లైన్ ప్రక్రియ వచ్చిన తరువాత కాగితపు రహిత ప్రక్రియ కొనసాగింది. మరింత సులభతరంగా ఉంది. అయితే ఇప్పుడు చేతిలో పరిష్కారం ఉన్న సర్వర్ సమస్యను సాకుగా చూపి తిరిగి మాన్యువల్ ను ఆశ్రయిస్తుండడమే అనుమానాలకు కారణం. సింపుల్ గా పరిష్కారం కావాల్సిన సర్వర్ సమస్యను రోజుల తరబడి నాన్చడమే కాకుండా..పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలనుకోవడాన్ని ఏమనుకోవాలి?
పారదర్శకత కోసమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో మాన్యువల్ పద్ధతిలో భారీగా అవకతవకలు చోటుచేసుకునేవి. తప్పుడు రికార్డులతో క్రయ విక్రయాలు జరిగేవి. అటు అధికారులు, సిబ్బంది చేతివాటం చూపిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అదే మాన్యువల్ పద్ధతి తెరపైకి రావడంతో గత అనుభవాలు గుర్తుకొస్తున్నాయి. పెద్ద ఎత్తునభూములు పేర్లు మార్చుకోవడం.. ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటివి చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మామూలుగా ప్రభుత్వం జీవోలే ఆన్ లైన్ లో పెట్టదు. ఇక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి బయటకు తెలిసే చాన్స్ లేదు. ఎవరి భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో..ఎవరో చేశారో చెప్పడం కష్టం. ఫేక్ పత్రాలతో ఇప్పటికే ఏపీలో జరగాల్సిన అరాచకాలన్నీ జరిగిపోతున్నాయి. మాన్యువల్ విధానంతో చేస్తే చాలావరకూ అవకతవకలు పెరిగే అవకాశం ఉంది.
అయితే సర్వర్ సమస్య ఉందా? లేకుంటే సర్వర్ స్కెచ్ వెనుక భారీ స్కాం దాగి ఉందా? ఇప్పుడు అందరి అనుమానం ఇదే. ఇప్పటికే ట్యాంపరింగ్ అక్రమాలు కోకొల్లలు. వాటి గురించి అతీగతీలేదు. పథకాల పేరుతో ఆశ పడి ప్రజలు.. పెద్ద ఎత్తున కేసులు, అవినీతి, క్రిమినల్ రికార్డులు ఉన్న వారికి అధికారం కట్టబెట్టారు. వారి చేతికి అధికారం వచ్చిన తర్వాత ప్రైవేటు ఆస్తులకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఆస్తి ఎప్పుడు ఎవరి పేరు మీద మారిపోతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ తరుణంలో ఇటువంటి సర్వర్ స్కాంలు వారికి సర్వ సాధారణమే. కానీ ప్రజలకు మాత్రం శాపం.