
హిందువులు ఆవును పూజిస్తారనే సంగతి తెలిసిందే. ఆవును దేవతా స్వరూపంగా భావించడంతో పాటు ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవని పెద్దలు చెబుతారు. హోమాలకు, యజ్ఞాలకు సైతం ఆవుపాలనే వినియోగించడం జరుగుతుంది. దేవాలయాలలో పూజకు, అభిషేకానికి సైతం ఆవు పాలను మాత్రమే వాడతారు. ప్రస్తుత కాలంలో ఆవు పాలు కొనాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.
అయితే కర్నూలు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఆవుపాలను ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆవులను కూడా ఉచితంగా ఇస్తున్నాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు ఉచితంగా ఆవులను ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. దాదాపు ఐదు వందల ఆవులను పోషిస్తూ శీను జీవనం గడుపుతుండటం గమనార్హం. గడిచిన ఐదు సంవత్సరాలుగా అవసరమైన వారికి శీను ఆవును ఉచితంగా పంపిస్తున్నాడు.
అయితే ఉచితంగా ఆవును పొందాలంటే వారు కర్నూలు జిల్లాకు చెందిన వారై ఉండాలి. ఆవు దూడకు జన్మనిచ్చిన పక్షంలో శీను లేగదూడను కూడా వారితో పంపుతాడు. ఆవు పాలు తగ్గిన తరువాత దూడను తనకే కచ్చితంగా ఇవ్వాలని కచ్చితంగా చెబుతాడు. తన దగ్గర ప్రస్తుతం 500 ఆవులు ఉన్నాయని ఆ ఆవులకు గడ్డి నిలుపుకునేందుకు సరైన సౌకర్యం లేదని ఆవులకు గడ్డి వేసుకోవడానికి సరైన సౌకర్యం దొరకడం లేదని శీను చెబుతున్నాడు.
జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా తాను పాలిచ్చే ఆవును పంపించానని శీను తెలిపారు. తనకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తే ఆవులను మేపుకుంటూ ఎక్కువమందికి తన వంతు సహాయం చేస్తానని శీను చెబుతున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా శీను ఆవులను ఇస్తుండటం గమనార్హం.