Kurnool Kaveri bus accident: అసలే అది దారుణమైన ప్రమాదం. 20 మంది దాకా చనిపోయారు.. అంతే సంఖ్యలో గాయపడ్డారు. ఎన్నో ఆశలతో బస్సు ఎక్కిన వారంతా.. గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. అయినవాళ్లను శోకసముద్రంలో నుంచి వెళ్లిపోయారు. కనీసం వారి ఆనవాళ్లు కూడా లభించకుండా కన్నుమూయడంతో బంధువుల రోదనలు మామూలుగా లేవు. ఈ స్థాయిలో ప్రమాదం జరిగితే.. అయ్యో అని సానుభూతి చూపించాల్సింది పోయి.. పాపం అని బాధపడాల్సింది పోయి ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. తాను ఒక మనిషిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి అడ్డగోలుగా వ్యవహరించాడు.
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. ఇందులో ఒక మహిళకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ఆమె తలకు తీవ్రంగా గాయం కావడంతో విపరీతంగా ఇబ్బంది పడుతోంది. కనీసం ఒక మాట కూడా మాట్లాడేందుకు ఆమెకు శరీరం సహకరించడం లేదు. ఇంతటి ఇబ్బందిలో ఉన్న ఆమెను ఓ మీడియా ప్రతినిధి చికాకు పెట్టాడు. మంచం మీద ఉంది.. చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చింది అనే స్పృహ కూడా లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ చెందిన అనుకూల మీడియా కర్నూలు ప్రమాదాన్ని మరో కోణంలో చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం మీద బురద చల్లడానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తోంది. వాస్తవానికి ఇంతటి కష్టకాలంలో.. మాటలకందని విషాదంలో సహాయం చేయాల్సింది పోయి.. తన వంతుగా బాధితులకు అండగా ఉండాల్సింది పోయి.. రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. ప్రమాదంలో గాయపడిన వారితో పదేపదే మాట్లాడించేందుకు ప్రయత్నించింది. అందులో ఒక ప్రయాణికురాలితో ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధి దారుణంగా వ్యవహరించాడు.. మంచం మీద చికిత్స పొందుతున్న ఆమెను కనీసం మాట్లాడించేందుకు ప్రయత్నించవద్దని సోయి కూడా అతడికి లేకుండా పోయింది..”మేడం చెప్పండి ఇప్పుడు మీకు ఎలా ఉంది.. ఎలా అనిపిస్తోంది.. ప్రమాదం జరిగిన తీరు గురించి మీరు చెప్పండి” అంటూ తలతిక్క ప్రశ్నలు వేశాడు. వాస్తవానికి ఆమెకు శ్వాస తీసుకునే ఓపిక కూడా లేదు. అప్పటికి ఆమె ఓపిక తెచ్చుకొని.. నా ఆరోగ్యం బాగాలేదు.. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు. శ్వాస తీసుకునే ఓపిక కూడా లేదు. అలాంటి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆ బాధిత మహిళ ప్రశ్నించింది. దీంతో ఆ పాత్రికేయుడి పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఉన్న పరిస్థితి చూసి కూడా అలాంటి ప్రశ్నలు ఎలా అడగాలనిపించిందని అతడిని నెటిజన్లు విమర్శిస్తున్నారు.