YS Jagan-KTR: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) రెండు పార్టీల పరిస్థితి ఒకేలా ఉంది. కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు కెసిఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. ఆయన కుమారుడు కేటీఆర్ పార్టీని నడుపుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో ఓటమి, ఫార్ములా వన్ రేసింగ్ కేసులో ప్రాసిక్యూషన్ కి గవర్నర్ అనుమతించడం, కల్వకుంట్ల కవిత దెప్పిపొడుపులతో కేటీఆర్ సతమతమవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కెసిఆర్ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారానికి దూరం అవడమే కాకుండా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అటువంటి కేటీఆర్ బెంగళూరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవడం.. దానికి ఎలివేషన్లు ఇవ్వడం కొత్త చర్చకు దారితీస్తోంది.
అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి
ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) సైతం జగన్మోహన్రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ పార్టీ నేతలు వరుసుగా అరెస్టులకు గురవుతున్నారు. అది చాలదన్నట్టు తిరుపతి పరకామణి కేసు కూడా ఊహించని మలుపు తిరుగుతోంది. ఎప్పుడు ఏ కేసులో వైసిపి నేతలు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి అంత విధేయతగా పనిచేయడం లేదు. మరోవైపు అధికారానికి దూరమై ఏడాదిన్నర అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు మాత్రం భయపడుతున్నారు. జైలుయాత్రలతో పాటు వ్యక్తిగత యాత్రలు చేసే సమయంలో మాత్రం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. చివరకు అయ్యప్ప శబరిమలై లో సైతం జగన్ తనకు తాను ప్రచారం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా రప్పా రప్పా పోస్టర్స్ ప్రదర్శించి తమ నైజాన్ని చాటుకుంటున్నారు.
రెండింటిది సంకట స్థితి.. తెలంగాణలో( Telangana) బిఆర్ఎస్, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండింటి దుస్థితి అగమ్య గోచారం గానే ఉంది. రెండు పార్టీలకు ఎవరితోనూ పడదు. అందర్నీ శత్రువులుగానే భావిస్తుంటాయి. అందుకే ఇప్పుడు వారితో కలిసి ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఇది చాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డిని కలిసిన కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టారు. జగన్ తో కలిసి ఉన్న ఫోటోను చూసిన నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. తమకు ఎన్ని రకాలు ఇబ్బందులు ఎదురైనా.. తమ పార్టీల మధ్య స్నేహం తగ్గదని కేటీఆర్ హిట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టిడిపి అభిమానులు సైతం కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. మరోవైపు వైసిపి అభిమానులతో పాటు క్రిస్టియన్లు కెసిఆర్ పార్టీకి ఓట్లు వేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో స్నేహం వల్ల బిఆర్ఎస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి స్నేహాన్ని వదులుకోలేమని కేటీఆర్ సంకేతాలు పంపగలిగారు.