Bihar Elections 2025: నేటి కాలంలో అనేక రాష్ట్రాలు మద్యం ద్వారానే నెట్టుకొస్తున్నాయి. మద్యం ఇక్కడ ద్వారా వచ్చిన ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పైగా మద్యం ద్వారా జరుగుతున్న అక్రమాలు మామూలుగా లేవు. అనేక రకాల కుంభకోణాలు కేవలం మద్యం చుట్టూ చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కూతురు నుంచి మొదలు పెడితే మాజీ మంత్రి కుమారుడు వరకు అందరూ మద్యం కుంభకోణాలలో అభియోగాలు ఎదుర్కొన్నవారే.. కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించినవారే. ఇలా ఎన్ని జరుగుతున్నప్పటికీ మద్యం వ్యాపారం మాత్రం ఆగడం లేదు. మద్యం ద్వారా వస్తున్న ఆదాయం తగ్గడం లేదు.
మద్యానికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు గేట్లను బార్లా తెరిచాయి. అనేక కంపెనీలకు అనుమతులు కూడా ఇస్తున్నాయి. తద్వారా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నాయి. ఇది ప్రభుత్వాల దృష్టిలో మంచిదే అయినప్పటికీ.. ప్రజల దృష్టిలో మాత్రం అత్యంత అద్వానమైనది. మద్యానికి బానిసై చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. అనతి కాలంలోనే మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. ఫలితంగా చాలా మంది యువతులు చిన్నతనం లోనే విధవలు అవుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నాయి. అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని పూర్తిగా నిషేధించాయి. అలా మద్యాన్ని నిషేధించిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. అందులో జన్ సురాజ్ పార్టీ కూడా ఒకటి. బీహార్ ఎన్నికల ముందు ఈ పార్టీ ఇచ్చిన హామీ ఆ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది.
జన్ సురాజ్ పార్టీని ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. ఈపార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ సింగ్ కొనసాగుతున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక హామీ ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో తాము గనుక అధికారంలోకి వస్తే మద్యం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇలా మద్యం ద్వారా సాగించే విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 28 వేల కోట్ల రెవెన్యూ వస్తుందన్నారు. ఆ రెవెన్యూ ద్వారా ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ నుంచి ఆరు లక్షల కోట్ల రుణాల సమీకరణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. మరో వైపు బీహార్ రాష్ట్రంలో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలులో ఉంది.
మద్యపానం నిషేధాన్ని ఎత్తేస్తామని ప్రశాంత్ కిషోర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో.. బీహార్ రాష్ట్రంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తే బీహార్ రాష్ట్రంలో మద్యం ఏర్ల మాదిరిగా ప్రవహిస్తుందని అక్కడి మహిళలు అంటున్నారు. జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, అందువల్లే ఇలాంటి లేనిపోని హామీలు ఇస్తుందని మహిళలు మండిపడుతున్నారు. మహిళల మాంగల్యాలు తెంచి వేయడానికే ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలను బయటికి తీస్తున్నారని మహిళలు చెబుతున్నారు.