Konaseema District Collector: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు( collector Mahesh Kumar) ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పులిదిండిలో పడవ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీలకు ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ ట్రయల్ రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉండగానే ఆయన పొరపాటున కాలువలో పడిపోయారు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే స్పందించి కలెక్టర్ ను రక్షించారు. ఆయనను సురక్షితంగా వేరే పడవలో తీరానికి తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* మరోవైపు కోనసీమ జిల్లా అంతర్వేది లో( antarvedi ) మరో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు థార్ వాహనంలో సముద్రంలోకి దూసుకెళ్లారు. ఒక యువకుడు చాకచక్యంగా ముందే వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో యువకుడు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి ముగ్గురు యువకులు అంతర్వేది బీచ్ కు వచ్చారు. అక్కడే ఓ రిసార్ట్లో రూమ్ తీసుకుని ఆనందంగా గడిపారు. అయితే అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో రూమ్ లో ఒక యువకుడు ఉండిపోగా.. మిగతా ఇద్దరూ వాహనంలో బీచ్ కు బయలుదేరారు. అయితే బీచ్ లో ఓ మలుపు వద్ద రాష్ డ్రైవింగ్ తో నేరుగా వాహనం సముద్రంలోకి వెళ్ళింది. దీనిని గమనించిన ఓ యువకుడు వాహనం నుంచి గెంతేశాడు. అయితే సముద్రంలోకి వెళ్లిన ఆ వాహనం కనిపించకుండా పోయింది. తెల్లవారి వచ్చిన పోలీసులు వాహనాన్ని బయటకు తీయడంతో ఆ యువకుడి మృతదేహం లభ్యమయింది.
కోనసీమ జిల్లా కలెక్టర్కు తప్పిన ప్రమాదం
సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్లో పాల్గొనగా ప్రమాదవశాత్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాలువలో పడిపోయారు.
లైఫ్ జాకెట్ ఉండటంతో నీట మునగలేదు, సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. pic.twitter.com/KFjMI71nkH
— greatandhra (@greatandhranews) January 2, 2026