Kolusu Parthasarathy: మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరనున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీ హై కమాండ్ తో ఆయన విభేదిస్తున్నారు. ఇటీవల పెనమలూరులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో హాట్ కామెంట్స్ చేశారు. జగన్ తనను నమ్మడం లేదని.. తనకు అన్యాయం చేశారని విమర్శించారు. దీంతో వైసీపీలో కలకలం రేగింది. సజ్జల రామకృష్ణారెడ్డి అలెర్ట్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తిట్టాలని పురమాయించారు. కానీ పార్థసారథి మాత్రం చంద్రబాబుపై ఎటువంటి విమర్శ చేయలేదు. మీడియాపైనే నిందలు వేశారు. దీంతో పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు అధికార పార్టీ వర్గాల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి.
పార్థసారథి ఇదివరకే చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే జగన్ పై పార్థసారథి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ప్రోత్సహించారు. పెనమలూరు టికెట్ ఇవ్వడమే కాకుండా.. గెలిచిన తర్వాత మంత్రిని కూడా చేశారు. అయితే జగన్ మాత్రం క్యాబినెట్లో తీసుకోకుండా మొండి చేయి చూపారు. అప్పటినుంచి పార్థసారథి మనస్థాపంతో ఉన్నారు.ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు.
పార్థసారథి పై జగన్ అనుమానం పెట్టుకున్నారు. మంత్రి పదవి ఇస్తే సొంతంగా ఎదిగిపోతారని భావించారు. అందుకే పక్కన పెట్టారు. దీంతో పార్థసారధిలో జగన్ పై అసంతృప్తి ఉండిపోయింది. అదును చూసి దెబ్బ కొట్టాలని ఆయన భావించారు. వాస్తవానికి గత ఎన్నికల్లో పార్థసారధి తక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటమి ఖాయమని సంకేతాలు వచ్చాయి. దీంతో పార్థసారథి టిడిపిలో చేరితేనే ఫలితం ఉంటుందని ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. పార్థసారథి చేరితే టిడిపి టికెట్ దక్కి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టిడిపి టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఆయనకు చంద్రబాబు సర్ది చెప్పగలరు. ప్రత్యామ్నాయ అవకాశాలు చూపించగలరు. అవన్నీ కుదిరాకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. మరి రెండు రోజుల్లో పార్థసారథి టిడిపిలో చేరిక ఖాయమని ప్రచారం జరుగుతోంది.