Kolikapudi Srinivasa Rao: దూకుడుగా కలిగిన నేతలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తాయి. వారికి చట్టసభల్లో ప్రవేశించేలా చేస్తాయి. కానీ అదే దూకుడు పార్టీకి ఇబ్బంది తెచ్చి పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. చంద్రబాబు పిలిచి మరి టిక్కెట్ ఇచ్చి గెలిపించిన నేత ఇప్పుడు పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు కొలికపూడి శ్రీనివాసరావు. టీవీ డిబేట్లో బలమైన వాయిస్ వినిపించేవారు. తెలుగుదేశం పార్టీతో కలిసి అమరావతి ఉద్యమంలో పనిచేశారు. కానీ ఆయనకు టిడిపిలో సభ్యత్వం లేదు. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కొలికపూడి తిరువూరు నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఇబ్బందులు పడుతున్నారు. పార్టీని ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఆయన విషయంలో అధినేత చంద్రబాబు ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి.
* ఎంపీ పై సంచలన ఆరోపణలు..
ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై సంచలన ఆరోపణలు చేశారు కొలికపూడి. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చింది కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. అది మొదలు రచ్చ ప్రారంభం అయింది. వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వెనుక కేశినేని చిన్ని హస్తముంది. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంటుంది తిరువూరు. అక్కడ మాజీమంత్రి జవహర్ టిడిపి ఇన్చార్జిగా ఉండేవారు. కానీ అమరావతి ఉద్యమ నేతగా కొలికపూడికి మంచి గుర్తింపు ఉంది. ఆయన అయితే సరైన అభ్యర్థి అవుతారని.. ఎంపీ ఓట్లు గణనీయంగా పడతాయని చిన్ని భావించారు. కొలికపూడికి టికెట్ ఇప్పించారు. దీంతో ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గెలిచారు. కేశినేని చిన్ని ఎంపీ అయ్యారు. అయితే తిరువూరులో జరిగిన పరిణామాలతో కొలికపూడి ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఎంపీ చిన్ని అండగా నిలిచారు. అయితే రోజురోజుకు కొలికపూడి స్థానంలో తిరువూరు బాధ్యతలు ఎంపీ చిన్నికి అప్పగించారు. అయితే చిన్ని మాజీ మంత్రి జవహర్ కు ప్రోత్సాహం అందిస్తున్నారని కొలికపూడి అనుమానం వ్యక్తం చేస్తూ బ్లాస్ట్ అయ్యారు. ఏకంగా ఎంపీపై ఆరోపణలు చేసి వీధికి ఎక్కారు.
* గతంలోనే మందలింపులు..
గతంలో కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో చాలా రకాల వివాదాలు జరిగాయి. సొంత పార్టీ శ్రేణులే ఆయనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆందోళనలు కూడా జరిగాయి. ఒకటి రెండు సార్లు చంద్రబాబు పిలిచి గట్టిగానే మందలించారు. అయితే ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో పొలిటికల్ సైన్స్ బోధించే శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాలను మాత్రం తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. అయితే వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెట్టారు. ఇప్పుడు నేరుగా విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు ఎదుట ఈ పంచాయతీ నడవనుంది. అయితే అధినేత గట్టిగానే ఉన్నారని.. గట్టి చర్యలకు ఉపక్రమిస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.