Butchaiah Chaudhary: తెలుగుదేశం పార్టీలో కుదుపు ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. దీంతో టీడీపీ సీనియర్లు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ అభ్యర్థిని పవన్ ప్రకటించారు. అక్కడ జనసేన పోటీ చేస్తుందని పవన్ స్పష్టత ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా అనుమానిస్తున్నట్టే జరిగింది. సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి పెను సవాల్ ఎదురైంది.
రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరిని గత ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గానికి మార్చారు. ఆయన అయిష్టతగానే రూరల్ నియోజకవర్గానికి వెళ్లారు. జగన్ ప్రభంజనంలో సైతం గెలుపొందారు. రూరల్ నియోజకవర్గంలో అన్నీ సెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని జనసేన కోరుతోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ టిక్కెట్ తనకేనని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకటి రెండు సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ దక్కించుకోవడానికి ఎవరని ప్రశ్నించారు. పొత్తులో భాగంగా ఎక్కువగా చిక్కులు ఉన్న నియోజకవర్గం కూడా రాజమండ్రి రూరల్ గా నిలిచింది.
ప్రస్తుతం పవన్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్ బరిలో దిగుతారని నేరుగా పవన్ ప్రకటించారు. ఇప్పుడు ఆయనే అభ్యర్థి అని తేలేసరికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. బుచ్చయ్య చౌదరి టిడిపిలో దూకుడుగా ఉంటారు. అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. పవన్ నేరుగా ఇప్పుడు పార్టీ అభ్యర్థిని ప్రకటించేసరికి బుచ్చయ్య చౌదరి ఎలా స్పందిస్తారో చూడాలి.ఒకానొక దశలో బుచ్చయ్య చౌదరి లోకేష్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని కూడా ఒకటి రెండు సార్లు బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే నాయకుడికి టికెట్ లేకపోవడంతో ఎలా స్పందిస్తారో అని టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.