Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని అంటే ఒక ఫైర్. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులపై విరుచుకుపడే ఒక వెపన్. బుల్లెట్ లా దూసుకొచ్చే మాటలు, మధ్యలో పంచులు, అంతకుమించి బూతులు. ఆయన మాటలను చూసి వైసిపి శ్రేణులు ఫిదా అయ్యేవి. సాదరంగా ఆహ్వానించేవి. కానీ ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి బూతులు తగ్గాయి. ఓడిపోయిన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఒక్క బూతు మాట ఆడకుండా ముగించారు. దీంతో కొడాలి నాని లో ఏం మార్పు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
గత ఐదు సంవత్సరాలుగా కొడాలి నాని చేసిన కామెంట్స్ ఎలా ఉండేవో తెలుగు ప్రజలకు తెలుసు. ఎదుటివారు ఎంతటి వారైనా విడిచిపెట్టలేదు. చివరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను సైతం హేళన చేసిన సమర్థుడు కొడాలి నాని. మెగాస్టార్ చిరంజీవిని పకోడీ గాడు అంటూ సంభోదించారు. చంద్రబాబు,లోకేష్ ల గురించి చెప్పనవసరం లేదు. తెలుగు భాషలో వాడని బూతులను సైతం వారిద్దరిపై ప్రయోగించారు. మధ్యలో పవన్ ను సైతం విడిచిపెట్టలేదు. అయితే వైసీపీకి ఈ స్థాయి ఓటమిని కొడాలి నాని ఊహించలేదు. దాని మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నారు.
గుడివాడలో ఓడిపోయినా, వైసిపి అధికారంలోకి రాకపోయినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని ప్రకటించారు. వైసీపీకి ఘోర ఫలితాలు రావడంతో కొడాలి నాని రాజీనామా చేయాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ మోహన్ పై కూడా విరుచుకుపడింది. ఎక్కడా నాయకత్వంతో సంబంధం లేకుండానే.. టిడిపి శ్రేణులు కొంతమంది కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ఇళ్లపై దాడులకు ప్రయత్నించారు. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు పడ్డాయి. దీంతో కొడాలి నాని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీ శ్రేణులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమపై దాడులకు ప్రయత్నిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడ మాట తప్పలేదు. బూతు మాట అనలేదు. దీంతో కొడాలి నాని కి తత్వం బోధపడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బూతు పోయి భయం కనిపిస్తుందన్న సెటైర్లు పడుతున్నాయి.