Kodali Nani: వంగవీటి రాధాకృష్ణతో ఎంతో సన్నిహితంగా మెలిగే వారు కొడాలి నాని, వల్లభనేని వంశీ.పార్టీలు వేరైనా రాధాకృష్ణ విషయంలో ఎంతో స్నేహంతో మెలిగేవారు. అటువంటిది గత కొద్ది రోజులుగా ఈ స్నేహితులు పెద్దగా కలవడం లేదు.ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. గత ఐదు సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి,జయంతి సమయంలో తెగ హడావిడి నడిచేది. కొడాలి నాని తో పాటు వల్లభనేని వంశీ మోహన్ రంగాకు నివాళులు అర్పించేవారు. వంగవీటి రాధాకృష్ణతో కలిసి వేదిక పంచుకునేవారు.కానీ ఈ ఏడాది మాత్రం వారిద్దరూ కనిపించకపోవడం విశేషం. నిన్న వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి.విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో కాపు సేన ప్రతినిధులతో కలిసి రాధ నివాళులు అర్పించారు.కార్యక్రమంలో వంగవీటి కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. కానీ రాధాకృష్ణ స్నేహితులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ జాడ మాత్రం లేదు.
* అలా కుదిరింది స్నేహం
2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటికే టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని. 2009లో రెండోసారి గెలిచారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది.వైసిపి ఆవిర్భావంతో కొడాలి నాని ఆ పార్టీలో చేరారు. అటు తరువాత వంగవీటి రాధా సైతం వైసీపీలో చేరిపోయారు.2014 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ తెరపైకి వచ్చారు. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు నుంచే కొడాలి నానితో వల్లభనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ ముగ్గురు స్నేహితులుగా మారారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగారు.అయితే 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో రాధాకృష్ణ టిడిపిలో చేరారు.2019 ఎన్నికల తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. ఈ తరుణంలో వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో ఉండిపోయారు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ వైసీపీలో కొనసాగారు.ఈ క్రమంలో వారు చేసిన హడావిడి అంతా కాదు. వంగవీటి మోహన్ రంగా జయంతి, వర్ధంతి వేడుకల్లో హల్చల్ చేసేవారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఇప్పుడు వారికి స్నేహితుడు కనిపించడం లేదు.
* వారి జాడలేదు
ఈ ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు వంగవీటి రాధాకృష్ణ. కూటమి సూపర్ విక్టరీ సాధించడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ నుంచి సంకేతాలు వచ్చాయి. ఇంకోవైపు ఎన్నికలఫలితాలు వచ్చిన నాటి నుంచి కొడాలి నాని కనిపించడం లేదు. వల్లభనేని వంశీ జాడలేదు. వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు వారికి వంగవీటి మోహన్ రంగ గుర్తున్నారు. స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణకు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు మాత్రం వారికి గుర్తు లేకపోవడం విశేషం. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడమే కాకుండా.. రాధా తో చనువుగా మెలుగుతూ.. టిడిపిలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకే అప్పట్లో అలా ప్రవర్తించారని.. ఇప్పుడు అంత సీన్ లేదని అర్థమయిపోయిందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.