Kinjarapu Ram Mohan Naidu : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట సందడి నెలకొంది. ఢిల్లీ వేదికగా రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల నామకరణోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. కొద్దిరోజుల కిందట రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె ఉంది. రెండో సంతానంగా బాబు పుట్టాడు. దీంతో ఆ కుటుంబంలో సందడి నెలకొంది. ఆదివారం బారసాల నిర్వహించగా జాతీయస్థాయిలో ప్రముఖులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు భారీగా హాజరయ్యారు. దీంతో ఢిల్లీలో సందడి నెలకొంది. ప్రముఖుల సమక్షంలో రామ్మోహన్ నాయుడు తన కుమారుడికి శివాన్ ఎర్రం నాయుడుగా నామకరణం చేశారు.
* జాతీయస్థాయి ప్రముఖుల హాజరు..
ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా హాజరయ్యారు. వారితో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, మనోహర్ కట్టర్, హరదీప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేన, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రులు అచ్చెనాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
* చిన్న వయసులోనే కేంద్రమంత్రిగా..
ఎర్రం నాయుడు( Yaram Naidu ) అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీ అయ్యారు. ఈసారి ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులయ్యారు. చిన్న వయసులోనే మంత్రి పదవి ఇచ్చే పార్టీ రికార్డ్ సృష్టించారు. ఆయనకు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రావ్య తో వివాహం జరిగింది. తొలుత వీరికి కుమార్తె పుట్టింది. తాజాగా కుమారుడు పుట్టడంతో తన తండ్రి ఎర్రంనాయుడు పేరును పెట్టుకున్నారు రామ్మోహన్ నాయుడు. ఢిల్లీలో బారసాల వేడుక జరగగా.. శ్రీకాకుళం టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రామ్మోహన్ నాయుడుకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.