Kinjarapu Ram Mohan Naidu: తండ్రికి మించిన తనయుడు రామ్మోహన్ నాయుడు

ఏపీ రాజకీయాల్లో ఒక బులెట్ లా దూసుకొచ్చారు రామ్మోహన్ నాయుడు. 2012లో ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటివరకు ఎర్రం నాయుడుకు ఒక కొడుకు ఉన్నట్టు ఎవరికీ తెలియదు.

Written By: Dharma, Updated On : June 9, 2024 11:05 am

Kinjarapu Ram Mohan Naidu

Follow us on

Kinjarapu Ram Mohan Naidu: కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా వినిపిస్తున్న పేరు ఇది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి తుడుచుపెట్టుకుపోయింది. ఆ సమయంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి ఓడిపోయింది.కానీ ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. అంతలా శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మమేకమై పనిచేశారు ఈ యువనేత.ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఒక బులెట్ లా దూసుకొచ్చారు రామ్మోహన్ నాయుడు. 2012లో ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటివరకు ఎర్రం నాయుడుకు ఒక కొడుకు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు తన వాగ్దాటితో యావత్ దేశాన్ని ఆకట్టుకున్నారు. 2014, 2019, 2024 ఎంపికల్లో శ్రీకాకుళం నుంచి టిడిపి ఎంపీగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రజలకు అండగా నిలవడం లో ముందంజలో నిలిచారు. ఇతర ప్రాంతాల్లో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేవారు. విదేశాల్లో చిక్కుకునే వారికి, సరిహద్దు జలాలు దాటిన మత్స్యకారులకు క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావడంలో రామ్మోహన్ నాయుడు కృషి ఉంది. చాలా సందర్భాల్లో ఆయన వాగ్దాటికి జాతీయ స్థాయి నాయకులు సైతం ఫిదా అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం.. లోక్సభలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ఎర్రం నాయుడు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు. కానీ ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని ఎవరికీ తెలియదు. చిన్నతనంలో ఎలాంటి రాజకీయ నీడ పడకుండా పెరిగిన రామ్మోహన్ నాయుడు.. ఎంపీగా పోటీ చేసే వయస్సు కూడా రాకమునుపే అభ్యర్థిగా ఖరారయ్యారు. చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఎదిగారు. పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు గుణాత్మక పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా 2020లో సంసద్ రత్న అవార్డును పొందారు. తన పనితనంతో, దూసుకుపోయే తత్వంతో పార్లమెంట్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

రాష్ట్ర విభజన హామీలపై రామ్మోహన్ నాయుడు గట్టిగానే పోరాడారు. ప్రత్యేక హోదా విషయంలో పలుమార్లు గళమెత్తారు. విశాఖ రైల్వే జోన్ ఎంత అవసరమో కూడా వివరించే ప్రయత్నం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై కూడా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినంత పని చేశారు. అన్నింటికీ మించి అధినేత చంద్రబాబు, యువ నేత నారా లోకేష్ కు ఇష్టుడైన నేతగా మారారు రామ్మోహన్ నాయుడు. తండ్రి విధేయత, తన పనితీరుతో కేంద్రమంత్రి పదవి స్థాయికి ఎదిగారు యువ నేత రామ్మోహన్ నాయుడు.