Amaravati: నెరవేరిన అమరావతి ఆకాంక్ష.. పనులు ప్రారంభం

రాష్ట్రంలో అన్ని పార్టీల ఆమోద ముద్రతో చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. చంద్రబాబు పై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశారు.

Written By: Dharma, Updated On : June 9, 2024 11:09 am

Amaravati

Follow us on

Amaravati: అమరావతి ఊపిరి పీల్చుకుంది. టిడిపి కూటమి గెలవడంతో ఇక అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే.. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో పిచ్చి మొక్కలు, పొదలు పేరుకుపోయాయి. ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు సిబ్బంది. దాదాపు 100 వరకు జెసిబి లతో జంగిల్ క్లియరెన్స్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. టిడిపి గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని.. ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే పనులు ప్రారంభించడంతో అమరావతి రైతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.

రాష్ట్రంలో అన్ని పార్టీల ఆమోద ముద్రతో చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. చంద్రబాబు పై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. అయితే అమరావతి నిర్మాణ పనులు కీలక దశకు చేరుతున్న తరుణంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. టిడిపి ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఐదేళ్లుగా అమరావతిలో నిర్మాణాలు నిలుపు వేసి జగన్ వాటిని పాడు పెట్టారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. బొత్స లాంటి వారైతే అమరావతిని స్మశానంతో పోల్చారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని కించపరిచారు. అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానన్న జగన్ మాటలను తలుచుకొని నిద్రలేని రాత్రులు గడిపారు అమరావతి రైతులు. ఇప్పుడు కూటమి గెలిచేసరికి ఆనందంతో మురిసిపోతున్నారు.

అమరావతి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న తరుణంలోనే టిడిపి అధికారాన్ని కోల్పోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అన్ని రకాల అనుమతులతో రాజధాని నిర్మాణం ప్రారంభించడంలో జాప్యం జరిగింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు. ఇప్పటికే అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. పునాదుల సైతం ఏర్పడ్డాయి. వాటిపై నిర్మాణాలు చేయడమే తరువాయి.అందుకే ఒక మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం తుది రూపానికి రానుంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం, ప్రమాణ స్వీకారం చేయకుండానే పనులు మొదలుపెట్టి చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు స్పందించారు. ప్రమాణ స్వీకారం రోజునే అమరావతిపై విస్పష్ట ప్రకటన కూడా చేయనున్నారు. మొత్తానికి గత ఐదేళ్లుగా అమరావతి రైతులు పడిన బాధలను వర్ణించలేం. కానీ ఆ బాధలను టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అధిగమించగలమన్న నమ్మకం వారిలో ఏర్పడింది. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నది వారి ప్రగాఢ నమ్మకం.