Kia Industry : నేతలు చెప్పేదానికి.. చేస్తున్న దానికి అస్సలు పొంతన ఉండదు. రాజకీయాల్లో ఆత్మాభిమానం అనేదానికి చెల్లుబాటు ఉండదు కూడా. గత ఎన్నికల ముందు రాష్ట్రం నుంచి కియా కార్ల పరిశ్రమను తరిమేస్తానని విపక్ష నేతగా ఉన్న జగన్ ప్రకటించారు. పశ్చిమబెంగాల్ లో నానో కార్ల పరిశ్రమకు ఎదురైన పరాభవం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు అదే కియా పరిశ్రమను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కార్ల ఉత్పత్తిలో పది లక్షల మార్కు దాటడంతో శుభాకాంక్షలు తెలిపారు. ఆటోమోబైల్ పరిశ్రమలకు ఏపీ అనుకూలమని ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
2014లో టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. 2017 నుంచి కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే ఈ పరిశ్రమను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేశారని అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. భూములు కోల్పోయిన గొల్లపల్లి రైతులను పరామర్శించారు. వారిని అన్నివిధాలుగా రెచ్చగొట్టారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం కియా కార్ల పరిశ్రమను రాష్ట్రం నుంచి తరిమేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్ లో నానో కార్ల పరిశ్రమ విషయంలో ఎదురైన పరిణామాలే.. ఇక్కడ కూడా ఎదురుకావాల్సి ఉంటుందని హెచ్చిరించారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. నాడు బాధితులుగా చెప్పుకున్న గొల్లపల్లి రైతులను పరామర్శించారా? వారికి స్వాంతన కలిగించే నిర్ణయాలు తీసుకున్నారా? కియా కార్ల పరిశ్రమను తరిమేశారా? అంటే దేనికీ జగన్ వద్ద సమాధానం లేదు. కియా కార్ల పరిశ్రమతో నష్టం జరుగుతోందని గగ్గొలు పెట్టిన మేధావులు, ప్రజాసంఘాల జాడలేదు. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అని తేలిపోయింది. ప్రజలు కూడా జగన్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో పది లక్షల ఉత్పత్తి మార్కు దాటడడంతో సీఎం జగన్ చేసిన ట్విట్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమకు ప్రయోజనం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ఆ క్రెడిట్, క్రెడిబులిటీ చంద్రబాబుకు దక్కకూడదనే నాడు జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా ఫ్యాక్టరీని తరిమేస్తానని ప్రకటన చేశారు. కానీ 2017లో ఉత్పత్తిని ప్రారంభించిన కియా.. దినదిన ప్రవర్థమానంగా వృద్ధి చెంది.. పది లక్షల మార్కు ఉత్పత్తిని దాటేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది చంద్రబాబుకు ప్లస్ గా మారింది. అందుకే ఆయన సగర్వంగా ట్విట్ పెట్టారు. రాజకీయ దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని కియా పరిశ్రమ నిరూపించింది. కియా పరిశ్రమలో రాయలసీమకు ప్రయోజనం కలిగింది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. అనంతపురం నుంచి వలసలు తగ్గాయి. అంటూ చంద్రబాబు చేసిన ట్విట్ పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.