YS Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. గతంలో బెయిల్ మంజూరూ చేసినప్పుడు మెరిట్ ను పరిగణలోకి తీసుకోలేదని, అందుకే మరోసారి ఈ అంశంపై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు బెయిల్ రద్దు అంశాన్ని హైకోర్టుకు బదిలీ చేసింది. బెయిల్ పిటీషన్ పై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. ప్రధాన నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీని పై సీబీఐ ఏపీ హైకోర్టుకు వెళ్లింది. బెయిల్ రద్దు చేయాలని కోరింది. కానీ సీబీఐ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

మూడేళ్లుగా వైఎస్ వివేకా హత్యకేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో న్యాయం జరగదని వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. మరోవైపు కేసు తెలంగాణకు బదిలీ చేయడం పై ఏపీలో జగన్ ప్రభుత్వ తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సొంత బాబాయ్ కేసు ఏళ్ల తరబడి నాన్చడం, సొంత చెల్లే ఏపీ పై నమ్మకం లేదని .. కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయమని కోరడంతో విమర్శలు వెళ్లువెత్తాయి.