Y S Vijayamma: వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekar Reddy ) కుటుంబంలో కీలక పరిణామం చోటుచేసుకునుందా? ఆ కుటుంబమంతా ఏకతాటి పైకి రానుందా? వైసీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ పోషించనున్నారా? అందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని కోరారు. వైయస్సార్ కుటుంబ అభిమానులుగా అన్నా చెల్లెలు మధ్య విభేదాలు ఉండకూడదు అని తాము కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కుటుంబంలో చీలిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. అందుకే ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
* కుటుంబ సన్నిహితుల కోరిక అదే
ఒకనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి నడిచిన నేతలు చాలామంది కాంగ్రెస్( Congress) పార్టీలోనే ఉండిపోయారు. వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కొత్త వారిని చేరదీసి పదవులు ఇచ్చారు. కానీ గత ఐదేళ్లుగా కీలక పదవులు దక్కిన వారు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి సన్నిహితులు కనిపిస్తున్నారు. వారిని ఆశ్రయిస్తుండడంతో వారు కొత్త షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబమంతా ఏకతాటిపైకి వస్తేనే తాము వైసీపీలో చేరతామని చెబుతున్నట్లు సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
* గత కొద్ది రోజులుగా కుమారుడితో..
కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటనకు( foreign tour) వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో తల్లి విజయమ్మ కూడా వెళ్లినట్లు ప్రచారం నడిచింది. కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. ఇలా వెళ్లిన క్రమంలో విజయమ్మ ఎక్కడ కనిపించలేదు. అయితే మధ్యలో ఆమె కుమారుడు కుటుంబంతో చేరినట్లు టాక్ నడుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపాలపాయలో విజయంతో పాటు కుటుంబమంతా ఒక దగ్గరకు చేరింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద సామూహిక ప్రార్ధనలు కూడా చేశారు. అయితే కడప లాంటి జిల్లాలో పట్టు కోల్పోవడంతో మొత్తం రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయింది. అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే తాజాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగా ఉన్న సాకే శైలజానాథ్, రఘువీరారెడ్డి, ఉండవెల్లి అరుణ్ కుమార్, పల్లం రాజు, జీవీ హర్ష కుమార్ తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే శైలజానాథ్ చేరిపోయారు.
* ఆ ప్రకటన వెనుక వ్యూహం
అయితే తాజాగా శైలజా నాథ్( sailaja Naat ) చేసిన ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకోవాలన్న డిమాండ్ వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట వరకు ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా. కుమార్తెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే కుమార్తె రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విజయం సైతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. త్వరలో విజయమ్మ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.