AP Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. దేశంలోనే ఇది భారీ కుంభకోణం అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 3500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ద్వారా పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుండగా.. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ఈ కేసులో 29 మంది పై కేసులు నమోదయ్యాయి. ఓ 12 మంది అరెస్ట్ కూడా జరిగింది. తొలుత సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. చివరిగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్టు చేశారు. మరోవైపు చాలామంది ప్రముఖుల పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఒకవైపు విచారణ కొనసాగుతుండగా.. చార్జ్ షీట్లో సరైన ఆధారాలు చూపించలేదని చెబుతూ.. ఏసీబీ కోర్టు ఓ నలుగురికి బెయిల్ ఇచ్చింది. అయితే దీనిపై సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది.
* ఓ నలుగురికి బెయిల్
మద్యం కుంభకోణం( liquor scam) కేసులో ఏసీబీ కోర్టు ఓ నలుగురికి బెయిల్ ఇచ్చింది. జగన్ హయాంలో సీఎంఓ అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి, అప్పటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో మరొకరికి బెయిల్ లభించింది. వీరిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లలో సరైన ఆధారాలు చూపించకపోవడంతోనే బెయిల్ ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. దీనిపై హైకోర్టులో సవాల్ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. మద్యం కుంభకోణంలో వీరి పాత్ర ఉందని.. వారికి బెయిల్ ఇస్తే సాక్షాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని సిట్ చెబుతోంది. ఈరోజు పూర్తిస్థాయిలో వాదనలు వినిపించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయి.. 90 రోజులు దాటిన వారందరూ డిఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం పక్కా ఆధారాలతో కోర్టుకు నివేదించే అవకాశం ఉండడంతో వారి బెయిల్ అంత సులువు కాదు. అయితే ఈరోజు విచారణలో బెయిల్ లభించిన నలుగురికి రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే హైకోర్టు విచారణ పైనే అందరి దృష్టి ఉంది.
* అనేక రకాల మలుపులు..
అయితే ఇటీవల జరిగిన పరిణామాలు తో కీలక అరెస్టులు ఉంటాయని ప్రచారం నడిచింది. ముఖ్యంగా టిడిపి అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో భారతీ రెడ్డి ఈనాడు పత్రికకు లీగల్ నోటీస్ ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ఒక నిందితుడు అని.. ఆయన కంపెనీల ద్వారా మద్యం ముడుపులు బ్లాక్ నుంచి వైట్ గా మారాయని.. ఆ కంపెనీలో డైరెక్టర్ గా భారతి ఉన్నారని చెబుతూ ఈనాడులో ఒక కథనం వచ్చింది. అయితే వైయస్ భారతి అంటే అనిల్ రెడ్డి తల్లి అని మరో ప్రచారం ఉంది. అందుకే వైయస్ భారతి రెడ్డి ఈనాడుకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో ఈరోజు బెయిల్ రద్దు పై హైకోర్టులో విచారణ జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.