AP New Districts: ఏపీలో( Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లాల మార్పు, డివిజన్లో మార్పు సైతం చేపట్టనుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే తాము అధికారంలోకి వస్తే మార్పులు చేసి ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటులో కనీస నిబంధన పాటించలేదన్న విమర్శ ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటిలో చేర్పులు, మార్పులు వంటి వాటిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది. మరోవైపు ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రజలు వినతులు ఇచ్చే అవకాశం కూడా కల్పించింది.
* చర్చించిన తరువాతే..
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పు, సర్దుబాట్లపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. అయితే వీరికి ఇప్పటికే పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. జిల్లాల్లో కలెక్టర్లు సైతం వినతి పత్రాలు స్వీకరించారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న వాటిలో మార్పు వంటి వాటిపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అయితే ప్రభుత్వ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతోపాటు కొన్ని హద్దులు మార్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే జనాభా లెక్కలు జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకే 2027 మార్చి 31 వరకు జిల్లాల ఏర్పాటుకు వీలులేదని అధికారులు చెబుతున్నాయి. అందుకే జనగణనకు ముందే జిల్లాల ఏర్పాటు అనేది జరిగిపోవాలి. 2025 డిసెంబర్ 31 లోగా ప్రక్రియను ముగించాలి. అయితే ఓ మూడు జిల్లాల ఏర్పాటు పై మాత్రం ముమ్మర కసరత్తు జరుగుతోంది.
* ప్రజల నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్లు ఇవే
* ప్రకాశం జిల్లా( Prakasam district) మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అందుకే గిద్దలూరు,కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలుపుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
* బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపాలని డిమాండ్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలను తెస్తే ప్రకాశం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు అవుతాయి.
* అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఐదు నియోజకవర్గాలతో ఈ కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే అమరావతి రాజధానికి ఒక గౌరవం దక్కే అవకాశం ఉంది.
* రంపచోడవరం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం రంపచోడవరం అల్లూరి జిల్లాలో కొనసాగుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రంపచోడవరం డివిజన్ తో పాటు చింతూరు డివిజన్లోని నాలుగు విలీన మండలాలతో కలిపి ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా ఉంది.
* విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో చేర్చాలన్న డిమాండ్ కూడా ఉంది.
* మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని స్థానికులు కోరుతున్నారు.
* రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోకి తేవాలని అక్కడివారు విజ్ఞప్తి చేస్తున్నారు.
* కైకలూరి నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలో.. రైల్వే కోడూరు ను తిరుపతి జిల్లాలో కలపాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మంత్రుల సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.