Kisineni Naani : విజయవాడ( Vijayawada) మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పైగా రాజకీయ పాత మిత్రులను కలుస్తున్నారు. ఆపై శుభకార్యాలకు హాజరవుతున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. నాని పొలిటికల్ గా తిరిగి యాక్టివ్ అవుతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు నాని. కానీ సోదరుడు, టిడిపి అభ్యర్థి చిన్ని చేతిలో ఓడిపోయారు. జూన్ 4న ఫలితాలు రాగా.. జూన్ 10న కీలక ప్రకటన చేశారు. ఇకనుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు. అయితే 8 నెలలు గడవకముందే ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం ప్రారంభం అయ్యింది.
* బిజెపి అగ్రనేతలతో సంబంధాలు
వాస్తవానికి కేశినేని నానికి( Kisineni Naani) బిజెపి అగ్ర నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలతో నేరుగా మాట్లాడగలరు. అయితే వారి పిలుపుతో మళ్ళీ బిజెపిలో నాని చేరతారని ప్రచారం జరిగింది. దీనికి తోడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి అగ్రనేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో నాని ఆ పార్టీలోకి వెళ్లిపోతారని దాదాపు అంతా భావించారు. తెలుగుదేశం పార్టీతో విభేదించిన సమయంలో సైతం బిజెపిలో చేరుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ పార్టీలో ఓటమి ఎదురు కావడంతో మనస్థాపనతో ఏకంగా రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.
* తొలుత సేవా కార్యక్రమాలతోనే..
విజయవాడ( Vijayawada) పార్లమెంటు స్థానం పరిధిలో తన సేవా కార్యక్రమాలతో ముందుకు వచ్చారు కేశినేని నాని. స్వతహాగా వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆయన సేవా కార్యక్రమాల నుంచి రాజకీయాల్లో చేరారు. 2014లో తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఐదేళ్లపాటు విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడ్డారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలుపొందారు. అయితే టిడిపి నాయకత్వంతో విభేదాలు, కృష్ణాజిల్లాలో ఇతర నేతలతో విభేదాలు, సొంత కుటుంబంలో చీలికలతో.. టిడిపి హైకమాండ్ 2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ సొంత తమ్ముడు చేతిలో ఓడిపోయారు. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్న మనస్తాపంతో ఆ పార్టీకి దూరమయ్యారు.
* సేవలతోను ప్రజలకు దగ్గరగా..
అయితే తాజాగా ఆయన బిజెపిలో ( Bhartiya Janata Party)చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో కేశినేని నాని ప్రత్యేక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని.. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క రాజకీయాల ద్వారా మాత్రమే కాదని.. సేవా కార్యక్రమాల ద్వారా కూడా చేయవచ్చని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకు చివరి వరకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు కేశినేని నాని. తన రాజకీయ పునరాగమనంపై వస్తున్న ప్రచారానికి చెక్ చెప్పారు.