KCR Jagan vs Chandrababu Revanth: రాజకీయాలు, రాజకీయ పరిస్థితులు ఒకేలా ఉండవు. అవి ఒక చదరంగం లాంటివి. జూదం కంటే ప్రమాదకరం కూడా. అందుకే జాగ్రత్తగా ఆడాలి. జాగురకతతో ఆడాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా దానికి మూల్యం తప్పదు. అయితే ఈరోజు కింగ్ అయినవారు.. రేపు బాధితులుగా మారక తప్పరు.. ఈరోజు బాధితులుగా ఉన్నవారు రేపు కింగ్ మేకర్లు కాక తప్పదు. అయితే ఈ పరిస్థితులు ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరితో పొలిటికల్ గేమ్ ఆడారో.. వారి చేతుల్లో ఇప్పుడు బాధితులుగా మిగులుతున్నారు. అప్పట్లో రాజకీయ గేమ్ తో ప్రత్యర్ధులను గడగడలాడించిన వారే ఇప్పుడు కేంద్రం దయాదాక్షణ్యాలపై ఆధారపడక తప్పదు. వారే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు వీరిద్దరూ గురు శిష్యులు, సన్నిహితులు అయిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధితులుగా మారారు. కానీ ఒక్కప్పుడు వీరిద్దరూ ఆడిన పొలిటికల్ గేమ్ లో చంద్రబాబుతో పాటు రేవంత్ కూడా బాధితుడే.
తేలిగ్గా తీసుకున్న కేసిఆర్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని( Telangana CM Revanth Reddy ) పొలిటికల్ గా ఇబ్బంది పెట్టి, ఇరకాటంలో పెట్టాలని చూసారు కెసిఆర్. చాలా తేలిగ్గా తీసుకున్నారు రేవంత్ ను కెసిఆర్. రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించలేదు కూడా. కనీసం శాసనసభకు హాజరయ్యేందుకు కూడా మొగ్గు చూపలేదు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలని చూశారు. కానీ ఇప్పుడు అదే రేవంత్ కెసిఆర్, హరీష్ రావు మెడకు కాలేశ్వరం అవినీతి చుట్టుకునేలా చేశారు. ఆ కేసును సిఐడి కి అప్పగిస్తే చెడుగుడు ఆడుకోవాలని కేసీఆర్ భావించారు. కానీ రేవంత్ అనూహ్యంగా ఆ కేసును సిబిఐ అప్పగించారు. శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దీంతో కాలేశ్వరం కేసులో సిబిఐ ఎంట్రీ కాక తప్పని పరిస్థితి.
రేవంత్ గట్టి వ్యూహం
ప్రస్తుతం కెసిఆర్ భవిష్యత్ ప్రధాని మోదీ చేతిలో ఉంది. అదే రేవంత్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ విచారణ చేపట్టి కెసిఆర్ ను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి సానుభూతి పొంది మరోసారి మైలేజ్ దక్కించుకోవాలని గులాబీ దళం ఆలోచన చేసింది. అందుకే రేవంత్ తెలివిగా ఈ కేసు బంతిని ప్రధాని కోర్టుకు తన్నారు. ఒకవేళ కెసిఆర్ ను జైల్లో పెట్టిస్తే అది బిజెపికి మైనస్ గా మారుతుంది. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ప్రయత్నానికి గండి పడుతుంది. ఒకవేళ కెసిఆర్ నేతృత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీనం చేస్తే.. ఆ రెండు పార్టీల మధ్య ఎప్పటినుంచో ఒప్పందం ఉందని చెప్పి.. ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ బలంగా వెళ్లేందుకు ఒక మార్గం దొరుకుతుంది. ఇలా ద్విముఖ వ్యూహంతో అడుగులు వేశారు రేవంత్. అందుకే రేవంత్ వ్యూహానికి ఇప్పుడు కేసీఆర్ శిబిరంలో వణుకు పుడుతోంది.
ఏపీలో భిన్న పరిస్థితి..
అయితే ఏపీలో చూస్తే భిన్న పరిస్థితి ఉంది. మూడు పార్టీల కూటమి ఉంది. కానీ కూటమిలోనే టిడిపి, జనసేన ను మాత్రమే ప్రత్యర్థులుగా చూస్తోంది వైసిపి. రాష్ట్ర బిజెపి విషయంలో ఒకలా.. కేంద్ర బిజెపి విషయంలో మరోలా ఉంది వైసీపీ స్టాండ్. అందుకే ఇప్పుడు చంద్రబాబు( AP CM Chandrababu) మాస్టర్ ప్లాన్ వేశారు. మద్యం కుంభకోణం కేసును ఒక కొలిక్కి తెచ్చి సీబీఐకి అప్పగించే ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐతో జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడితే రాజకీయంగా కూటమికి మైలేజ్ వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో బిజెపి ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం చంద్రబాబు రాజకీయ అడుగులు మారే అవకాశం ఉంటుంది. తాను అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ పని చేయకుండా తెలివిగా సిబిఐ కు ఆ కేసు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డిని జాతీయస్థాయిలో సైతం ఇరకాటంలో పెట్టవచ్చు. అటు కేంద్రంలో తెలుగుదేశం కీలక భాగస్వామి. తప్పకుండా టిడిపి ఒత్తిడి ఉంటుంది. ఈ కేసులో సిబిఐ పట్టు బిగించి జగన్ పాత్రను బయట పెడితే మాత్రం వచ్చే ఎన్నికల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబుకు కావాల్సింది అదే. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నేతల భవిత ఇప్పుడు మోడీ చేతుల్లో ఉంది. చూడాలి మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?