Kanna Lakshminarayana : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆ సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న పేరు ఉండేది. టీడీపీ తో కలిసి బీజేపీ తరుఫున అధికార వైసీపీపై పోరాడారు. ఇటు జనసేనతోనూ సాన్నిహిత్యం నెరిపారు. కన్నా ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఒక జట్టుగా ఉండేవి. అయితే కన్నా పోయి సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక బీజేపీకి దూరంగా జరిగారు కన్నా. అనంతరం చంద్రబాబు హామీతో టీడీపీలో చేరారు. తాజాగా ఆయనకు సత్తెనపల్లి సీటు కేటాయిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నాకు సీటును ఖాయం చేసి సెట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని నియమించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తీవ్ర పోటీ ఉంది.ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి పదవిపై ముగ్గురు నేతలు కన్నేశారు. గ్రూప్ వార్ తో టీడీపీ కేడర్ తలలు పట్టుకుంది. 2019 వరకూ ఈ సీటులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణానంతరం తనయుడు కోడెల శివరాం వారసుడిగా సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా ఈ సీటు కోసం బలంగా పోటీపడుతున్నారు. వీరిద్దరే కాదు టీడీపీ నేత మన్నెం శివనాగమల్లేశ్వరరావు సీటు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే సీటు కోసం పార్టీ, సామాజిక సేవ కార్యక్రమాల్లో బీజీగా ఉంటున్నారు. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇన్ చార్జి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఊహించని విధంగా నమ్మి బీజేపీ నుంచి టీడీపీ లో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి పదవిని ఇచ్చి చంద్రబాబు ఆ నియోజకవర్గ ఆశించిన నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే సీటు కోసం ముగ్గురు హోరాహోరీ తలపడుతున్న వేళ కన్నాకు సీటు ఇవ్వడంతో వారు నిరాశకు గురయ్యారు. వీరంతా కలిసి టీడీపీకి ఫేవర్ గా పనిచేస్తారా? కన్నా గాటిన కడుతారా? లేదా. అసమ్మతి చెలరేగుతుందా? అన్నది వేచిచూడాలి.