K A Paul : ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టులో పిటిషనర్ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చేసిన ఆమెని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు హోదా ప్రకటించలేదని.. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, సహకారం అవసరమని కోర్టుకు వివరించారు. ఏపీ ప్రస్తుత, గత ప్రభుత్వాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్న వైరాన్ని ప్రస్తావించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేందర్, జస్టిస్ కిరణ్ మై తో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయడం విశేషం. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది.
* పదేళ్లు అవుతున్నా అమలు లేదు
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణను విభజిస్తూ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారు. ఆ సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది జరిగి పదేళ్లు అవుతున్న ప్రత్యేక హోదా హామీ కార్యరూపం దాల్చలేదు. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో ప్రత్యేక హోదా సాధ్యం కాలేదు. దానినే ప్రచార అస్త్రంగా వాడుకొని 2019 ఎన్నికల్లో వైసిపి గెలుచుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయింది.
* కేంద్రానికి నోటీసులు
ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి అయింది. కానీ ప్రత్యేక హోదా అంశం మరుగున పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందించింది. పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, ఆర్థిక శాఖల కార్యదర్శులు, నీతి అయోగ్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి నోటీసులు పంపించింది. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంపై కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని.. వాటితో పాటు కేఏ పాల్ వేసిన పిటిషన్ విచారణ చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాది కోరారు. కానీ న్యాయస్థానం మాత్రం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 24 వాయిదా వేసింది. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు అయింది.
* పాల్ గట్టి పోరాటం
గత కొద్దిరోజులుగా కేఏ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తరచూ లేవనెత్తుతున్నారు. ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగడం విశేషం. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం వివాదంగా మారుతున్న నేపథ్యంలో.. అదే అంశం హైలెట్ అవుతుండడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. 24 న జరిగే విచారణలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి.