Junior NTR : మౌనం వీడిన జూనియర్ ఎన్టీఆర్.. పోస్ట్ వైరల్

మరోవైపు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఓడిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే శుభాకాంక్షలు తెలిపారని కొంతమంది టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 5, 2024 6:46 pm

Junior NTR broke his silence.. The post went viral

Follow us on

Junior NTR : ఏపీ రాజకీయాలపై ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ మౌనం వీడారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత స్పందించారు. గతంలో రాజకీయ అంశాలకు దూరంగా ఉండే తారక్.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేసరికి స్పందించడం విశేషం. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఆయన శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజెన్లు, టిడిపి శ్రేణులు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆయన స్పందనకు చాలా ఆలస్యం అయ్యిందని.. క్లిష్ట సమయంలో ముఖం చాటేసిన మీరు ఇప్పుడు స్పందించడం ఏమిటని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఏపీలో టీడీపీ కూటమి అసాధారణ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు.’ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మావయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ‘ అంటూ ఎన్టీఆర్ పోస్టులో పేర్కొన్నారు. అటు మరో నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ సైతం ఇదే తరహా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ సోదరులు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై తారక్ మాట్లాడడం లేదు.రాజకీయ వేదికలు పంచుకోవడం లేదు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వల్లభనేని వంశీ మోహన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవి ఏపీవ్యాప్తంగా సంచలనం రేపాయి. పెను వివాదానికి దారితీసాయి. ఆ సమయంలో సైతం తారక్ పొడిపొడిగానే స్పందించారు. ఎక్కడా భువనేశ్వరి పేరు కానీ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ పేరు సంబోధించకుండా.. కొద్దిపాటి ఖండనకే పరిమితం అయ్యారు. తర్వాతఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా జగన్ మార్చారు.ఆ సందర్భంలో కూడా తారక్ సరిగ్గా స్పందించలేదు. ఎన్టీఆర్ ను, వైయస్ రాజశేఖర్ రెడ్డిని లెజెండ్రీ పర్సన్స్ గా మాత్రమే అభివర్ణించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు స్వయంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానించినా ముఖం చాటేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు సినీ ప్రముఖులంతా కూటమికి మద్దతు తెలుపుతూ ట్విట్ చేశారు. అప్పుడు కూడా తారక్ స్పందించలేదు. అయితే టిడిపి కూటమి ఘనవిజయం సాధించిన తర్వాత తారక్ ఈ తరహా లో శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. దీనిని టిడిపి శ్రేణులు పెద్దగా స్వాగతించడం లేదు. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఓడిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే శుభాకాంక్షలు తెలిపారని కొంతమంది టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.