Jubilee Hills by-election result: తెలంగాణాలోని జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉండబోతోంది? దాని ప్రభావం ఏపీపై ఉంటుందా? కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది? బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత బరిలో దిగారు. అధికార కాంగ్రెస్ సైతం అభ్యర్థిని దించింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి మారింది. బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదట. అయితే పోలింగ్ ముందు వరకూ బీఆర్ఎస్.. పోలింగ్ తరువాత కాంగ్రెస్ గెలుస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
సెటిలర్స్ టీడీపీ వైపే..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతగా యాక్టివ్ లేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో, అందునా సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం అధికం. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తటస్థ వైఖరి అనుసరించింది. అప్పటికే ఏపీలో అక్రమ కేసుల్లో చంద్రబాబు అరెస్టయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా టీడీపీ పోటీచేయలేదు. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు రేవంత్ వైపు మొగ్గుచూపినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు కావడంతో వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ వైపు మళ్లాయి. కాంగ్రెస్ గెలవడంతో దాని ప్రభావం 2024లో జరిగిన ఏపీ ఎన్నికలపై చూపాయి.
ఏదీ గెలిచినా టీడీపీకే అడ్వాంటేజ్..
అయితే తాజాగా జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెటిలర్స్ దే అధిక ప్రభావం. అందుకే తెలుగుదేశం చుట్టూ రాజకీయాలు తిరిగాయి. కానీ ఆ పార్టీ మద్దతు నేరుగా పొందేందుకు ఏ పార్టీ ప్రయత్నించలేదు. ఎన్టీఏలో బలమైన భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉంది.కచ్చితంగా బీజేపీ టీడీపీ సహకారం కోరాలి. కానీ తెలంగాణలో టీడీపీపై ఉన్న ముద్రతో బీజేపీ మద్దతు కోరలేదు. బీజేపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో మద్దతు కోరేందుకు కాంగ్రెస్ సాహసించలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ మునుపటికి భిన్నంగా టీడీపీ విషయంలో సానుకూలత ప్రదర్శించింది. కానీ బీఆర్ఎస్ గత అనుభవాదలను పరిగణలోకి తీసుకొని టీడీపీ సహకారం కోరలేదని పరిస్థితి. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, చంద్రబాబుకు సన్నిహితులు కావడం.. అదే సమయంలో తన సన్నిహితుడు రేవంత్ రెడ్డికి ఇవి కీలకమైన ఎన్నికలు కావడంతో ఇప్పుడు కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా తటస్థ వైఖరి తీసుకున్నారు.సో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఎవరు గెలిచినా టీడీపీకి అడ్వాంటేజే. కానీ వైసీపీకి మాత్రం కచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తేనే అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిస్తే వైసీపీ శ్రేణులు నిరాశతో మునిగిపోయినట్టే.