Delhi car blast key points: ఢిల్లీలో సోమవారం ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గరలో ఒక కారులో బాంబు పేలుడు సంబంధించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే కీలకమైన ఐదు అంశాలను మాత్రం ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వాటి ఆధారంగానే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాయి.
1.ఆత్మాహుతి దాడి కాదు
వాస్తవానికి ఈ ప్రమాదానికి సూసైడ్ స్క్వాడ్ కారణం కాదని తెలిసింది. ఉన్నట్టుండి చోటు చేసుకున్న భయం.. ఆందోళన.. కంగారు వంటి వాటి వల్ల పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఇవన్నీ లేకుంటే.. దేశంలో ఏదైనా చేయాలి అనుకుంటే.. ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది.
2.పూర్తిగా సిద్ధం చేయలేదు
ఈ కారులో అమర్చిన బాంబు అత్యంత శక్తివంతమైనది. అది అప్పటికే పూర్తిగా రెడీ కాలేదు. తయారీలో చోటు చేసుకున్న లోపం వల్ల అది పరిమితంగానే పేలిపోయింది. అందువల్లే నష్టం తీవ్రత చాలా తక్కువగా నమోదయింది.
3.వాటిని ఏర్పాటు చేయలేదు
ఇటువంటి బాంబులలో ఉగ్రవాదులు స్క్రూలు లేదా మేకులు ఏర్పాటు చేస్తారు. బాంబు పేలినప్పుడు అవన్నీ గాల్లోకి విడుదలై మిగతా వారిని తీవ్ర గాయాలపాలు చేస్తాయి. కొన్ని సందర్భాలలో స్క్రూలు, మేకులకు ఉగ్రవాదులు విషం పూస్తారు. పైగా ఈ పేలుడు జరిగిన ప్రాంతంలో నేలపై ఎటువంటి గుంత ఏర్పడలేదు. ఈ ప్రకారం బాంబు తయారీలో అతి ప్రమాదకరమైన ఆర్డిఎక్స్ ఉపయోగించలేదని తెలుస్తోంది.. గాయపడిన వారిలో మేకులు, స్క్రూలు, ఇనుప ముక్కలు కనిపించలేదు.
4.అందువల్లే కుట్ర దారుల్లో భయం
వచ్చిన సమాచారం ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఫరీదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, పుల్వామా ప్రాంతాలలో మెరుపు దాడులు నిర్వహించాయి. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అనుమానితులను అరెస్టు చేశాయి. దీంతో కుట్రదారులలో తీవ్రమైన ఆందోళన పెరిగింది. ఒత్తిడి కూడా అధికమైంది. ఆ కంగారులోనే వారు తప్పుడు పని చేశారు.
5.పద్ధతి అనుసరించలేదు
ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి ఆత్మాహుతి కి పాల్పడే వ్యక్తి చెప్పినట్టు చేయలేదు. వారు అనుసరించే విధానాన్ని పాటించలేదు. పేలుడు పదార్థాలు నిండిన కారును టార్గెట్ దిశగా ఢీ కొట్టించలేదు. నిర్దిష్ట ప్రాంతంలో పార్కు చేసి పారిపోలేదు.
వాస్తవానికి భద్రత సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ లభించగానే అరెస్టులు చేశాయి. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించే కుట్రలను నిర్వీర్యం చేశాయి. ఇదే సమయంలో ఉగ్రవాదుల అసలు కలుగులను గుర్తించడానికి.. వీరి వెనుక ఉన్న వ్యక్తులను అంతం చేయడానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి. కంటికి కునుకు లేకుండా వెతుకుతూనే ఉన్నాయి. వారు చేసిన ఈ పని వల్లే ఈరోజు దేశం భారీ ముప్పు నుంచి తనను తాను కాపాడుకుంది.