Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కలకలం సృష్టిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అందువల్లే పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి.. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ఏకంగా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం రంగంలోకి దిగింది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు ప్రచారం కూడా చేశారు.. బహిరంగ సభలలో పాల్గొని మాట్లాడారు.. బిజెపి అభ్యర్థి తరఫున ఆ పార్టీ కీలక నాయకులు మొత్తం రంగంలోకి దిగారు.. కిషన్ రెడ్డి నుంచి మొదలుపెడితే బండి సంజయ్ వరకు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీతకు సంబంధించిన వ్యవహారం ఒకటి తెరపైకి వచ్చింది. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ కు సునీత రెండవ భార్య.. ఆయనకు గతంలోనే వివాహం జరిగింది.. ఆయన మొదటి భార్య పేరు మాలిని దేవి.. ఆయన ద్వారా ఆమెకు ఒక కుమారుడు సంతానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల గోపినాథ్ మొదటి భార్య కొడుకు విలేకరుల ఎదుటకు వచ్చారు. సునీత గోపీనాథ్ కు చట్టబద్ధమైన భార్య కాదని ఆరోపించారు. ఆమెకు తమ ఇంటిపేరు వాడుకునే అధికారం లేదని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ సునీతకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ కూడా సాగించారు. ఇది జరుగుతుండగానే మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి విలేకరుల ఎదుటికి వచ్చారు. ఆమె కూడా కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు..
మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ విషయం ఆమెకు చెప్పలేదట. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అతడిని చూసేందుకు వీలులేదని చెప్పారట. ఇదే విషయాన్ని కేటీఆర్ తో చెబితే.. నేను చూసుకుంటా అన్నాడట. ఆ తర్వాత ఆస్పత్రిలో ఆమెకు తెలియకుండానే వేరే మార్గం నుంచి వెళ్లిపోయారట. కేటీఆర్ వచ్చి వెళ్లిన తర్వాత తన కొడుకు చనిపోయాడు అని చెప్పారని.. తన కొడుకు మరణం వెనుక తెలియని విషయాలు చాలా ఉన్నాయని ఆమె వాపోయారు. అంతేకాదు మాగంటి సునీత ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హురాలు కాదని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, ఆయన కుమారుడు విలేకరుల ఎదుట వచ్చారు. వారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా చూస్తే మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుంది? సునీత విజయం సాధిస్తుందా? కుటుంబ సభ్యులు అనేక ప్రశ్నలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాగంటి సునీత భవితవ్యం ఏమవుతుందనేది తెలియాల్సి ఉంది.