BalaKrishna- Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గారా? బాబాయ్ బాలకృష్ణ తో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారా? నందమూరి కుటుంబమంతా ఏకతాటిపైకి రావాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల కిందట బాలా బాబాయ్ అంటూ అబ్బాయి నోటి నుంచి వచ్చిన పిలుపు నందమూరి అభిమానులకు ఒక కిక్ ఇచ్చింది. పద్మ భూషణ్ బాలకృష్ణకు ప్రకటించిన సందర్భంగా తారక్ శుభాకాంక్షలు తెలిపాడు. బాలా బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. దీంతో నందమూరి కుటుంబంతో సఖ్యతకు తారక్ ప్రయత్నిస్తున్నాడు అన్న ప్రచారం ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా తారక్ తో బాలకృష్ణ విభేదిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఆ ఇద్దరూ ఒకే వేదికపై రావడం అరుదు. ఒకరు విషయాల్లో ఒకరు కలుగజేసుకోవడం లేదు. కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం లేదు. పలకరింతలు అంతకంటే లేవు. కానీ బాబాయికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో అబ్బాయి స్పందించాడు. అయితే దీనిపై బాలకృష్ణ రిప్లై ఎలా ఉంటుందో చూడాలి.
* చాలా రోజుల కిందట నుంచి గ్యాప్
నందమూరి తారక రామారావు బయోగ్రఫీతో నాయకుడు, కథానాయకుడు చిత్రాల్లో బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు తారక్ బాబాయ్ బాలయ్యతో మంచి సంబంధాలే కొనసాగించారు. ఆ చిత్రాలకు సంబంధించి ఫంక్షన్లకు తారక్ హాజరయ్యారు. అటు తరువాత ఏం జరిగిందో ఏమో కానీ.. వారిద్దరి మధ్య దూరం ప్రారంభమైంది. అటు కళ్యాణ్ రామ్ సైతం బాలకృష్ణకు దూరమయ్యారు. సోదరుడు తారక్ కు దగ్గరయ్యారు. తరువాత చాలా పరిణామాలు వారి మధ్య గ్యాప్ పెంచాయి. మధ్యలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, మేనత్త భువనేశ్వరి పై వైసీపీ నేతల అనుచిత వైఖరి వంటి విషయాల్లో తారక్ పొడిపొడిగా స్పందించారు. తాత శత జయంతి వేడుకలకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాలన్నీ మరింత దూరం పెంచాయి.
* కార్యక్రమాలకు ఎన్టీఆర్ దూరంగా
అయితే తాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. ఆ సమయంలో రజినీకాంత్ చేసిన ప్రసంగంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. కొడాలి నాని లాంటివారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ శరీర ఆకృతిపై కూడా కొడాలి నాని మాట్లాడారు. అయితే కొడాలి నాని వెనుక ఎన్టీఆర్ ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. అది నందమూరి కుటుంబంతో తారక్ కు మరింత గ్యాప్ పెంచింది. అప్పటికే టిడిపి ప్రతిపక్షంలో ఉంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ సమయంలో తారక్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాలు తారక్ నటనకు గాను ఆస్కార్ అవార్డు లభించింది. చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపినా.. బాలకృష్ణ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అటు తర్వాత తారకరత్న అకాల మరణంతో.. కుటుంబమంతా ఒక్కచోటకు చేరిన పలకరింతలు లేకుండా పోయాయి. అప్పట్లో తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ బాలకృష్ణ పట్టించుకోని వైనానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
* అభినందనలు తెలిపిన ఎన్టీఆర్
ఎన్నికల్లో టిడిపి కూటమి గెలిచింది. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ లతో పాటు బాలకృష్ణ కు సైతం అభినందనలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. దీనిపై చంద్రబాబుతో పాటు లోకేష్ రిప్లై ఇచ్చారు. కానీ బాలకృష్ణ నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అయితే బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి దాదాపు అగ్ర కథానాయకులంతా వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ జాడలేకుండా పోయింది. కనీసం తారక్ ప్రస్తావన కూడా లేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ వ్యవహార శైలి చూస్తుంటే అందర్నీ కలుపుకునే తత్వం కనిపిస్తోంది. ఈ సమయంలో తారక్ నుంచి స్పందన రావడంతో తప్పకుండా బాలకృష్ణ కలుపుకొని వెళ్తారని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.