Journalist Vasudevan Missing: మీడియాలో సంచలనాల కోసం కొందరు చేస్తున్న అతి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మారుతోంది. తాజాగా ఓ తెలుగు టీవీ ఛానల్ లో ఓ జర్నలిస్ట్ చేసిన వివాదాస్పద కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఓ మాజీ ముఖ్యమంత్రి కి భద్రత లేదు అంటూ.. ఏకంగా ఆయనను అంతమొందించేందుకు అమెరికా నుంచి మనసులను రప్పించారంటూ కామెంట్స్ చేశారు ఓ సీనియర్ జర్నలిస్ట్. ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా భావించిన ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు జర్నలిస్టు కోసం వెతుకులాట ప్రారంభించారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.. సదరు టీవీ ఛానల్ యాజమాన్యంతో పాటు చీఫ్ ఎడిటర్ నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇది తెలుగు నాట హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: బల ప్రదర్శన.. చంద్రబాబు, జగన్ మధ్య తేడా అదే!
అప్పట్లో సాక్షి మీడియాలో..
మొన్న ఆ మధ్యన సాక్షి మీడియాలో వచ్చిన కథనం అభ్యంతరకరంగా మారింది. సాక్షి ఛానల్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా ఓ డిబేట్ నిర్వహించారు. అమరావతి రాజధాని అంశంపై ఆ చర్చ కొనసాగింది. ఈ క్రమంలో అమరావతిలో ఉండే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కృష్ణంరాజు అనే జర్నలిస్ట్. అమరావతిలో ఆ తరహా మహిళలే అధికం అంటూ వ్యాఖ్యానించారు. దానిని సమర్థించారు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు. దీనిపై పెను దుమారం రగిలింది. అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. సదరు జర్నలిస్ట్ కృష్ణంరాజు తో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు సైతం అరెస్టయ్యారు. అయితే అప్పటినుంచి సాక్షి మీడియాపై విపరీతమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు సాక్షి మీడియాలో ఏవైనా కథనాలు ప్రచురించే ముందు డిస్క్లైమర్ వేయడం ప్రారంభించారు. అంటే జర్నలిస్ట్ వ్యాఖ్యలతో మీడియా సంస్థకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం అన్నమాట.
జగన్ ను అంతమొందించేందుకు..
అయితే తాజాగా 99 టీవీలో ఓ డిబేట్ లో పాల్గొన్నారు జర్నలిస్ట్ వాసుదేవన్. జగన్మోహన్ రెడ్డి భద్రతపై చర్చ జరిగింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ వ్యాఖ్యానించారు వాసుదేవన్. అయితే ఇది దుమారానికి దారితీసింది. కనీసం హేతుబద్ధత, నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారని వాసుదేవన్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో జనసేన నేతలు ఏపీలో ఆయనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అయితే వాసుదేవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నోటీసులు అందించేందుకు ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు 99 టీవీ ఛానల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. వారి వద్ద వివరాలు తీసుకున్నారు. అయితే ఆ వాసుదేవన్ అనే జర్నలిస్టుతో 99 టీవీకి సంబంధం లేదని యాజమాన్యం తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్టు వాసుదేవన్ కోసం ఏపీ పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Also Read: చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ బాధితులు!
కొత్త పోకడలు..
అయితే ఇటీవల తెలుగు మీడియాలో విపరీతమైన రాజకీయ జోక్యం, రాజకీయ విమర్శలు, వ్యతిరేక కథనాలు, అనుకూల వార్తలు పెరిగిపోయాయి. తెలుగు నాట మీడియాలో చీలిక ఏనాడో ప్రారంభం అయింది. ఫలానా మీడియా ఫలానా పార్టీకి సంబంధించినది అనేది సామాన్యులు గుర్తించే పరిస్థితి వచ్చింది. ఇటువంటి తరుణంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి మీడియాను వాడుకుంటున్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉంది. కానీ తటస్థ మీడియా సైతం ఇప్పుడు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేందుకు సిద్ధపడుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు తెలుగు నాట ఈ మీడియా ద్వారా మరిన్ని వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. అయితే గతంలో కేవలం ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో మాత్రమే డిస్క్లైమర్ వేసేవారు. ఇప్పుడు న్యూస్ ఛానళ్లు కూడా డిస్క్లై మర్ వేసుకునే పరిస్థితి రావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రత్యర్ధులు లీగల్ గా అటాక్ చేస్తారన్నది ఎక్కువమంది భయం. అయితే భయం మాటున నిజాలు నిర్భయంగా చూపించడానికి తప్పకుండా వెనుకడుగు వేస్తుంది మీడియా. అయితే ఈ పరిస్థితి రావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.