Jogi Ramesh Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) కల్తీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కల్తీ మద్యం డంపు వెలుగులోకి వచ్చింది. దీంట్లో హస్తం ఉందని టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి తో పాటు మరో నేత పై అనేక ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మరో ఆలోచన చేయకుండా పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఆ మరుక్షణం నుంచి కల్తీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళనలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. అయితే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం డంపు ఒకటి వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి జోగి రమేష్ సాక్షి మీడియాను తీసుకెళ్లి దానిని బయటపెట్టారు. అయితే ఇంతలో తంబళ్లపల్లె కల్తీ మద్యం డంప్లో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విదేశాల నుంచి ఏపీకి వస్తు సంచలన వీడియో విడుదల చేశారు. జోగి రమేష్ ప్రోద్బలం తోనే తాను కల్తీ మద్యం తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు జనార్దన్ రావు. ఆయన చెప్పినట్టుగానే తంబళ్లపల్లె నియోజకవర్గం లో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చిన మరుక్షణం జోగి రమేష్ రంగంలోకి దిగాడు. దాన్నిబట్టి కల్తీ మద్యం వ్యవహారంలో జోగి పాత్రను గుర్తించారు పోలీసులు.
కూటమిలో డోర్స్ క్లోజ్..
జోగి రమేష్ ( Jogi Ramesh) కూటమి ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకునేందుకు ఒకానొక దశలో ప్రయత్నాలు చేశారు. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం ఇబ్బందికరంగా మారింది. జోగి రమేష్ తీరుపై వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అసహనం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి సైతం అనుమానపు చూపులు చూశారు. అదే సమయంలో కూటమి పార్టీల నుంచి జోగి రమేష్ విషయంలో అనేక రకాల అభ్యంతరాలు వచ్చాయి. ఆయనతో అధికార పార్టీ నేతలు వేదిక పంచుకోవడానికి టిడిపి కూటమి శ్రేణులు వ్యతిరేకించాయి. దీంతో జోగి రమేష్ కు అర్థం అయింది. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండక తప్పదని.. అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మించాలని భావించారు జోగి రమేష్. అందులో భాగమే కల్తీ మద్యం ప్రోత్సాహం అని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక విచారణలో తేలింది.
ఆదాయంలోనూ షేరింగ్..
జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు సైతం దీనిలో పాలుపంచుకున్నట్లు అర్థమవుతుంది. అయితే కల్తీ మద్యం ప్రోత్సాహమే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాం నుంచి ఈ కల్తీ మద్యం రాజ్యమేలిందని సీట్ గుర్తించింది. కల్తీ మద్యం ద్వారా వచ్చిన ఆదాయంలో జోగి రమేష్ కు కొంత మొత్తం వెళ్లిందని.. వివిధ ఖాతాల ద్వారా ప్రధాన నిందితుడు జనార్దన్ రావు నుంచి రూ.70 లక్షల నగదు జోగి రమేష్ కు చేరినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే మొత్తం వ్యవహారం చూస్తుంటే జోగి రమేష్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది.