JC Prabhakar Reddy: కొన్ని స్నేహాలు శాశ్వతం.. మరికొన్ని మాత్రం మధ్యలోనే నిలిచిపోతాయి. పరిస్థితులకు తగ్గట్టు ఉంటాయి. అయితే మనస్ఫూర్తిగా స్నేహం చేసిన వారు మాత్రం చివరి వరకు కలిసి ప్రయాణం చేస్తారు. ఒకరి కష్టాల్లో ఒకరు పాలుపంచుకుంటారు. తాజాగా అటువంటి స్నేహం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కనిపించింది. ప్రస్తుతం తమిళనాడు లో ఎన్నికలు హారాహోరీగా సాగుతున్నాయి. అక్కడ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది. డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇంకోవైపు టీవీ కే విజయ్ పార్టీ సైతం బరిలో ఉంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ప్రచారాన్ని పతాక స్థాయిలోకి తీసుకెళ్తున్నాయి. ప్రచారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో వేస్తారు ఏపీకి చెందిన టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి. అక్కడ తన స్నేహితుడు మునిరత్నంకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు జెసి.
* కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా..
ఏపీలో తెలుగుదేశం బిజెపితో స్నేహంగా కొనసాగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి పట్ల సానుకూలంగా ఉంది. అటువంటిది శోలింగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మునిరత్నంకు మద్దతుగా జెసి ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేయడం విశేషం. వీరిద్దరూ మంచి స్నేహితులు. ట్రావెల్స్ బిజినెస్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మునిరత్నం పోటీ చేస్తుండడంతో జెసి ప్రభాకర్ రెడ్డి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలతో మాట్లాడి మునిరత్నంకు మద్దతుగా పావులు కదుపుతున్నారు జెసి. ఆయన ప్రచారానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన స్నేహితుడిని గెలిపించాలని జెసి ప్రభాకర్ రెడ్డి కోరుతున్న తీరు ఆకట్టుకుంటుంది.
* సుదీర్ఘ నేపథ్యం..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు ఏఎం మునిరత్నం. తొలిసారిగా తమిళనాడు లోని శోలింగర్ నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1991 లోను విజయం సాధించారు. 1996లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తమిళ మనీలా కాంగ్రెస్ లో చేరారు. కానీ తర్వాతే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఉన్నారు. 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2021 లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయనకు మద్దతుగా స్నేహితుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించారు. స్నేహితుడి కోసం ఏపీ నుంచి సీనియర్ నేత రావడంపై తమిళనాడు వాసులు ఆసక్తిగా చూస్తున్నారు.