JC Prabhakar Reddy: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ గెలిచేందుకు చేయని ప్రయత్నం ఉండదు. ఇప్పటికే కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాయని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హస్తం ఉంది. ప్రధానంగా రాయలసీమ నుంచి జెసి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోందని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. జెసి దివాకర్ రెడ్డి కుమారుడు వైసీపీకి టచ్లోకి వచ్చారని.. జెసి ప్రభాకర్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెగ హడావిడి నడిచింది. కానీ దానికి చెక్ పెట్టారు జెసి ప్రభాకర్ రెడ్డి. నిన్ననే చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలు సందర్భంగా స్పష్టమైన సంకేతాలు పంపారు జెసి ప్రభాకర్ రెడ్డి. తమ కుటుంబం పై జరుగుతున్న ప్రచారం విషయంలో వాస్తవం ఇది అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జెసి ప్రభాకర్ రెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
* కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి..
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చేరింది జెసి ఫ్యామిలీ. అప్పట్లో జెసి దివాకర్ రెడ్డి 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా గెలిచారు. 2019లో ఎంపీగా దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి.. ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే ఆ ఇద్దరు నేతలు కూడా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం జెసి అస్మిత్ రెడ్డికి మాత్రమే టిడిపి టికెట్ దక్కింది. పవన్ రెడ్డి విషయంలో సానుకూల నిర్ణయం రాలేదు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ అని తేల్చి చెప్పడంతో పవన్ రెడ్డి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. జెసి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీ నాయకత్వం పై ఆగ్రహంగా ఉన్నారని.. ఆ ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని తెగ ప్రచారం నడిచింది ఆ మధ్యలో. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆ విషయాలను పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.
* చంద్రబాబు అంటే గౌరవం..
ముక్కు సూటిగా ఉండే జెసి ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy) విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రత్యేక గౌరవం ఇస్తూ వస్తారు. ప్రభాకర్ రెడ్డి సైతం చంద్రబాబు నాయకత్వాన్ని బలంగానే సమర్థిస్తుంటారు. అయితే నిన్ననే తాడిపత్రిలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అయితే జెసి ప్రభాకర్ రెడ్డి సందడి అంతా ఇంత కాదు. చంద్రబాబు చిత్రపటం వద్ద కేక్ కట్ చేసిన ప్రభాకర్ రెడ్డి డాన్స్ వేశారు. చంద్రబాబు చిత్రపటానికి కేక్ తినిపించారు. చంద్రబాబు నాయకత్వం అంటే ఏంటో.. తమ కుటుంబం విషయంలో జరుగుతున్న ప్రచారానికి ఆ ఒక్క ఘటనతోనే చెప్పారు జెసి ప్రభాకర్ రెడ్డి.