https://oktelugu.com/

Chandrababu- Pawan Kalyan : రాజకీయ ఆసక్తి పెంచిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

రాబోవు ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొత్తులపైనా ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2023 / 10:29 PM IST
    Follow us on

    Chandrababu- Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరు కలుసుకోవడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. చర్చలు బహిరంగం కాకపోయినప్పటికీ, ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు తాజా పరిస్థితులపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాబోవు ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొత్తులపైనా ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.

    జీవో నెంబరు.1పై విశాఖలో ఒకసారి, కుప్పంలో ఆంక్షలు పెట్టి అడ్డుకోవడంపై గతంలో రెండుసార్లు భేటీ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడటానికి సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంలోనే రెండు పార్టీలు కలిసి వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన అభిమతం. ఈ క్రమంలో వేర్వేరుగా పోటీ చేస్తే అది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

    బీజేపీతో దగ్గరయ్యేందుకు టీడీపీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్ కూడా అదే కోరుకుంటున్నారు. అయితే, ఇది సాధ్యం కాకపోతే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతారనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆకాశనికెత్తుకోవడంపై అటు వైసీపీ, ఇటు వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే, ఇప్పటికప్పుడు పొత్తులపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు.

    పవన్ కల్యాణ్ ఇంకా వారాహి రూపంలో ప్రజల మధ్యకు రాలేదు. అటు లోకేష్ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. పవన్ కూడా యాత్రలు మొదలుపెడితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంటుందన్నడంలో సందేహం లేదు. టీడీపీ, జనసేన సృష్టించే ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోతుందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాల ఎత్తుగడులను నిశితంగా గమనిస్తున్న వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.