Driver Rayudu Case: గ్లాస్ గుర్తు పార్టీ శ్రీకాళహస్తి బాధ్యురాలిగా కొనసాగుతున్న కోటా వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు రాయుడు కేసును పోలీసులు ఎలా ఛేదించారు? ఈ కేసులో ఎలాంటి ఆధారాలు వారికి లభించాయి? వాటి ఆధారంగా ఎలాంటి పురోగతి సాధించారు.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ మెదులుతున్నాయి. చెన్నైలో కూవం నదిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో
అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతి కింద ఈ కేసును నమోదు చేశారు. ఆ యువకుడి మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత.. పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. బృందాలుగా విడిపోయి కేసును చేదించడం మొదలుపెట్టారు.
ముందుగా సిసి ఫుటేజ్ పరిశీలించారు. శ్రీనివాసులు మృతదేహాన్ని ఆంధ్ర లో అంతం చేసి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ గల కారులో తీసుకొచ్చి.. శ్రీనివాసులు మృతదేహాన్ని కూవం నదిలో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. సిసి టివి ఫుటేజ్ లో ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. శ్రీనివాసులు రాయుడు కుడి చేతి మీద పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు.. వినూత పేర్లు కనిపించాయి.. దీంతో పోలీసులు ఆ దిశగా ఆరా తీశారు. ఇందుకు శ్రీకాళహస్తి పోలీసుల సహాయం కూడా తీసుకున్నారు. సిసి ఫుటేజ్ లో గోపి, శివ, మరో నిందితుడిని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: తన డ్రైవర్ ను జనసేన లేడీ ఇన్ చార్జి ఎందుకు అంత క్రూరంగా అంతం చేసింది? ఏంటా కథ?
శ్రీనివాసులు రాయుడు గడిచిన 15 సంవత్సరాలుగా వినూత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆమెకు నమ్మిన బంటుగా ఉన్నాడు. వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేస్తున్నాడు. గడచిన నెల 21వ తేదీన వినూత ఒక బహిరంగ ప్రకటన చేశారు. తన దగ్గర ఇకపై శ్రీనివాసులు పనిచేయడం లేదని పేర్కొన్నాడు. అతనితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అతడు తమకు పూడ్చ లేని ద్రోహం చేశాడని.. అందువల్లే అతడిని తొలగించామని ఆమె ప్రకటించారు. అయితే వినూత ప్రత్యర్థుల వద్ద రాయుడు డబ్బులు తీసుకొని.. వారికి సంబంధించిన సమాచారాన్ని చేరవేర్చుతున్నాడని.. అందువల్లే అతడిని విధుల నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. విధుల నుంచి తొలగించిన తర్వాత రాయుడు కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కనిపించడం మానివేశాడు. రాయుడిని శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి, ఆమె భర్త, ఇంకా కొంతమంది శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ గోదాంకు తరలించి.. అక్కడ చిత్రహింసలు పెట్టారని.. అక్కడ అతడిని అంతం చేసి చెన్నై శివారులోని కూవం నదిలో పడేశారని తెలుస్తోంది. పోలీసుల విచారణలు కూడా ఇవే విషయాలు వెలుగులోకి వచ్చాయి . ఈనెల 8న ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసులో చెన్నై పోలీసులకు సిసి ఫుటేజీలు కీలకంగా మారాయి. ఫుటేజీల ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి ఈ కేసులో పురోగతి సాధించారు..
వినూత వద్ద 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న శ్రీనివాసులు..ఉన్నట్టుండి ఆమె సమాచారాన్ని ప్రత్యర్థులకు ఎందుకు చేరవేర్చారు? ప్రస్తుతం శ్రీకాళహస్తిలో అధికారిక కార్యక్రమాలు మొత్తం వినూత ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పైగా ఇక్కడ ప్రతిపక్షం కూడా అంత బలంగా లేదు. అలాంటప్పుడు వినూతకు సంబంధించిన ఏ సమాచారాన్ని శ్రీనివాసులు ఆమె ప్రత్యర్థులకు చేరవేర్చాడు? ఆమె పేరును చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తి.. ఆమె సమాచారాన్ని ప్రత్యర్థులకు ఎందుకు చేరవేరుస్తాడు? అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లోనే సమాధానాలు లభిస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.