TDP Janasena Alliance: కృష్ణాజిల్లాలో జనసేన నాలుగు సీట్లు డిమాండ్ చేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో వాటిని కేటాయించాలని పట్టుబడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. మధ్యలో బిజెపి విషయం తేలనుండడంతో తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ ప్రాతినిధ్యం ఉండాలని జనసేన కోరుకుంటుంది. కొన్ని జిల్లాల్లో మెజారిటీ సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అటు కృష్ణా జిల్లాలో సైతం ఏకంగా 4 సీట్లు అడుగుతున్నట్లు సమాచారం.
ప్రధానంగా విజయవాడ పశ్చిమ, పెడన, కైకలూరు, అవనిగడ్డ సీట్లు జనసేన అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఈ సీట్లలో పోటీ చేస్తే సునాయాసంగా గెలుపొందుతామని జనసేన అంచనా వేస్తోంది. పెడన సీటును జనసేనకు కేటాయించాలని అభ్యర్థన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంపీ బాలశౌరి కుమారుడి కోసం సీటును పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపి నుంచి మాజీమంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గాన్ని సైతం జనసేన ఆశిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ జనసేన టికెట్ ఆశిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మండలి బుద్ధ ప్రసాద్ ను తప్పించి జనసేనకు చంద్రబాబు టిక్కెట్ కేటాయిస్తారా? లేదా? అన్నది చూడాలి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సైతం జనసేన ఆశిస్తోంది.ఇక్కడ జనసేన నేతగా ఉన్న పోతిన మహేష్ పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. తప్పకుండా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారని ఆయన ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు టిడిపి నుంచి జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్ధ వెంకన్నలు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు పోతిన మహేష్ పవన్ ను కలిసి టిక్కెట్ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కైకలూరు సీటును సైతం జనసేన ఆశిస్తోంది. టిడిపి ఇన్చార్జిగా ఉన్న జయ మంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. దీంతో ఈ సీటును జనసేన ఆశిస్తోంది. ఒకవేళ బిజెపితో పొత్తు కుదిరితే.. ఈ సీటును ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. గతంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కామినేని శ్రీనివాస్.. ఎమ్మెల్యేగా గెలుపొంది టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.మొత్తానికైతే కృష్ణా జిల్లాలో జనసేన నాలుగు సీట్లను ఆశిస్తుండడం విశేషం.