Jagan illegal assets cases: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy ) సిబిఐ కేసుల విచారణ ప్రారంభం కాలేదు ఎందుకు? తెలుగుదేశం పార్టీ పట్టుబడడం లేదా?? కేంద్రం పట్టించుకోవడం లేదా? జగన్ విషయంలో బిజెపి సానుకూల వైఖరితో ఉందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. అయితే జగన్మోహన్ రెడ్డి పై నమోదైన కేసుల విషయంలో జాప్యం జరుగుతుండడం వెనుక.. చట్టంలో ఉన్న లొసుగులే ప్రధాన కారణం. ఎందుకంటే వరుసగా జగన్మోహన్ రెడ్డి విషయంలో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. అందుకే ఈ కేసు విచారణలో తాత్సారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మాత్రం రాజకీయ కోణం లేదన్నది విశ్లేషకుల మాట. తాజాగా దాల్మియా కంపెనీ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ తో ఇది స్పష్టం అవుతోంది.
మొత్తం 20 కేసులు…
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S rajasekha Reddy ) హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అన్నది జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ఆరోపణ. దానిపైనే 11 సిబిఐ కేసులతో పాటు తొమ్మిది ఈడీ కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది. దాదాపు 16 నెలల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా కూడా ఉండిపోయారు. తరువాత బెయిల్ పై బయటకు వచ్చారు. గత 14 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. కానీ ఆయన కేసులు మాత్రం విచారణకు నోచుకోవడం లేదు. దీనికి డిశ్చార్జ్ పిటిషన్లే కారణమని తెలుస్తోంది. అప్పట్లో ఓ 70 మంది వరకు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. పేరు మోసిన కంపెనీలు సైతం అప్పుడు క్విడ్ ప్రోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ అభియోగాలను మోపింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేసులతో తమకు సంబంధం లేదని.. తమ పేరును తొలగించాలని కోరుతూ ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలు కోర్టుల్లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణకు రాకుండా ఆగిపోతున్నాయి అనేది సిబిఐ వాదన.
సిబిఐ కోర్టు కాకపోతే హైకోర్టుకు..
తాజాగా దాల్మియా సిమెంట్స్( Dalmia Cements ) సంస్థ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసింది. తమకు ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసుతో సంబంధం లేదని కోర్టులో వాదనలు వినిపించింది. అయితే సిబిఐ సైతం గట్టి వాదనలే వినిపించింది. జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. భారతి సిమెంట్స్ లో దాల్మియా కంపెనీ పెట్టుబడులు ఉన్నాయని వాదించింది. భారతి సిమెంట్స్ అనేది ముందుగా ఏర్పాటు కాలేదు. రఘురామ సిమెంట్స్ కంపెనీ పేరిట ఉన్న పరిశ్రమను వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. అయితే అంతకు ముందే రఘురామా కంపెనీలో షేర్స్ కొనుగోలు చేసింది దాల్మియా. అయితే తరువాత భారతీ సిమెంట్ సైతం షేర్స్ కొనుగోలు చేసింది. కానీ భారతీయ సిమెంట్స్ కంటే దాల్మియా ఎక్కువ కోడ్ చేసింది. అంటే రఘురామ సిమెంట్స్ ద్వారా ప్రయోజనాలు పొందాలనుకుంది. అయితే అప్పట్లో క్విడ్ ప్రో లో భాగంగానే దాల్మియా 95 కోట్ల రూపాయలు భారతి సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టింది. అయితే అప్పట్లో దాల్మియా సిమెంట్స్ కొన్ని రకాల పెట్టుబడులు పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది అన్నది సిబిఐ వాదన. అయితే భారతి సిమెంట్స్ ను ఓ విదేశీ కంపెనీకి విక్రయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాక మునుపే భారతి సిమెంట్స్ ను 145 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది విదేశీ సంస్థ. అయితే భారతి సిమెంట్స్ లో దాల్మియా కంపెనీ పెట్టిన పెట్టుబడులను ఈ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంతో సెటిల్ చేశారని చెబుతోంది దాల్మియా. అయితే దీనిపై సీబీఐ కోర్టులో దాల్మియా కంపెనీ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేతకు గురైతే హైకోర్టును ఆశ్రయిస్తుంది. గత 14 సంవత్సరాలుగా ఇటువంటి డిస్చార్జ్ పిటిషన్లతోనే జగన్మోహన్ రెడ్డి కేసులు పెండింగ్లో ఉండిపోయాయి. అంతే తప్ప దీనికి రాజకీయ కారణాలు లేవు.