YSR Congress : వైసిపి( YSR Congress ) కోసం ఐప్యాక్ రంగంలోకి దిగనుందా? పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనుందా? గతం మాదిరిగా కాకుండా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుదీర్ఘకాలం వైసీపీ కోసం ఐప్యాక్ సేవలందిస్తూ వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఐపాక్ సేవలందించింది. అప్పట్లో ఉన్న టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది ఐప్యాక్. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించింది. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత రాటుదేలేలా చేసింది. అందుకే తన విజయంలో సింహ భాగం ఐ ప్యాక్ కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో ఐప్యాక్ టీం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పై నమ్మకం పెట్టడం విశేషం.
* వ్యూహకర్తకు దూరంగా ప్రశాంత్ కిషోర్
2019 తర్వాత ఐప్యాక్( I pack) టీం ను విడిచిపెట్టారు ప్రశాంత్ కిషోర్. అప్పటివరకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు. తన సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయినా.. ఆయన సహచరుడు రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం మాత్రం గత ఐదేళ్లుగా సేవలు అందిస్తూ వచ్చింది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ గెలుపు కోసం సూచనలు చేశారు. టిడిపి గెలుపు ఖాయమని ప్రకటనలు చేశారు. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. తాజాగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. కీలక చర్చలు జరిపారు.
* కొత్తగా మరో సారధి
మరోవైపు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కోసం పనిచేసిన షో టైం టీంలో సభ్యుడిగా ఉన్న శాంతాన్ వైసిపి టీం లో చేరనున్నట్లు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఐప్యాక్ సైతం మార్చి నుంచి పూర్తిస్థాయిలో వైసిపి కోసం పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ఓటమితో ఐపాడ్ టీం పై రకరకాల విమర్శలు వచ్చాయి. వైసీపీ నేతలపై ఐ ప్యాక్ టీం తో నిఘా పెట్టడం.. వైసిపి నేతల పై అనుమానం వచ్చేలా చూడడం వంటి వాటిపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
* జిల్లాకు ఇద్దరు మాత్రమే
గతం మాదిరిగా ఐప్యాక్( ipak ) టీంలో వందలాదిమంది ప్రతినిధులు ఉండరు. నియోజకవర్గానికి నలుగురు ఐదుగురు చొప్పున అస్సలు ఉండరు. అలా ఉంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఉమ్మడి జిల్లాకు ఇద్దరు చొప్పున మాత్రమే ఐపాక్ టీం ప్రతినిధులు ఉండనున్నారు. వారే పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించే అవకాశం ఉంది. మరోవైపు ఐప్యాక్ విభాగంలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రుషిరాజ్ సింగ్ తో పాటు శాంతాన్ సైతం సేవలందిస్తారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.