Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఇకనుంచి ప్రజల్లో బలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి పార్టీలు మూడు సమన్వయంతో ముందుకు సాగుతుండడం, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుండడంతో జగన్ వైఖరిలో మార్పు వచ్చింది. ఇక జనంతోనే ఉంటేనే పార్టీ మనుగడ, ఉనికి సాధ్యమన్న నిర్ణయానికి వచ్చారు. 2029 జనవరి వరకు జనం బాట పట్టేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 2026 సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* అప్పట్లో వస్తానని చెప్పి..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. 2024 జూన్ 4న కూటమి గెలిచింది. అదే నెల 12న బాధ్యతలు స్వీకరించింది. అయితే ఘోర పరాజయంతో పూర్తి నైరాస్యంలో కూరుకుపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా తీసుకొని ముందుకు వచ్చారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2025 జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని.. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వారంలో నాలుగు రోజులు పర్యటిస్తానని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా ప్రజల్లోకి వస్తే బాగుండదని సీనియర్లు సలహా ఇచ్చారు. దీంతో తన జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నారు.
* పునరాలోచనలో పడి
అయితే కూటమి పట్టు బిగిస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పునరాలోచనలో పడ్డారు. ఒకవైపు పార్టీని కాపాడుకుంటూనే 2029 నాటికి బలం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే వరుసగా జనంలో ఉండేలా ప్లాన్లు చేస్తున్నారు. 2026 జనవరి నుంచి జనం బాట పట్టేందుకు నిర్ణయించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలకు సిద్ధపడుతున్నారు. 2026 జూన్ లోగా జిల్లాల పర్యటన పూర్తి చేయనున్నారు. అదే ఏడాది జూలైలో మంగళగిరి ప్రాంతంలో వైసిపి ప్లీనరీ ఏర్పాటుకు నిర్ణయించారు. 2027 ద్వితీయార్థం నుంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ జనం బాట పట్టణం ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎలా జనాలకు చేరువ అవుతారో చూడాలి.