Jagan: జగన్ ( Y S Jagan Mohan Reddy ) విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందా? అనవసరంగా ఆయనకు హైప్ చేస్తున్నామని భావిస్తోందా? అందుకే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించదలచుకోలేదా? పోలీస్ ఆంక్షలు విధిస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి హడావిడి లేదు. దానికి కారణం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆంక్షలు లేకపోవడమే. పోలీసులు ఇట్టే అనుమతులు ఇవ్వడమే. దీంతో జగన్మోహన్ రెడ్డి తన షెడ్యూల్ ప్రకటించుకున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగన్ కృష్ణాజిల్లా వెళ్తున్నారని అసలు ప్రచారం జరగలేదు. దీంతో ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. కూటమి వ్యూహం మార్చడంతో జగన్కు ఉన్న ప్రచారం పడిపోయింది.
* ప్రచార యావతో..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీకి ప్రచార యావ ఎక్కువ. జగన్ బయటకు అడుగుపెడితే జనం తప్పదు. జన సమీకరణ చేయాల్సిందే. ఆది నుంచి ఆ పార్టీకి అది అలవాటు కూడా. సానుభూతి అనే పునాదితో ఏర్పడింది ఆ పార్టీ. రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక వర్గం ప్రజలు విపరీతమైన అభిమానాన్ని చాటుకుంటారు. ఈ క్రమంలో ఆ సానుభూతి, అభిమానం కొనసాగాలంటే జన సమీకరణ అనేది నిత్యం జరగాల్సిన కార్యక్రమం గా వైసీపీ భావిస్తుంది. అయితే గత 17 నెలల కాలంలో జగన్ బలప్రదర్శనకు దిగడాన్ని కూటమి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డికి అధిక ప్రచారం దక్కింది. అందుకే ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇకనుంచి జగన్ పర్యటనలకు ఎటువంటి అడ్డంకులు, షరతులు విధించకూడదని భావిస్తోంది.
* మారిన ప్రభుత్వ ఆలోచన..
జగన్ పర్యటనలకు ప్రభుత్వం షరతులు విధిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వినియోగించుకుంటుంది. ఆ పార్టీకి సోషల్ మీడియా( social media) బలం ఉంది. ఆపై ఐపాక్ టీం సేవలందిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య దృష్ట్యా కొన్ని రకాల షరతులు విధిస్తుండగా.. దానిని జవదాటి ప్రవర్తిస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దీంతో అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతోంది. అధినేత విషయంలో అతిగా ప్రవర్తించే వైసీపీ శ్రేణులు రాజకీయంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఘోర ఓటమి నుంచి తక్కువ రోజుల్లోనే వైసిపి తేరుకోగలిగింది. దానికి కారణం ప్రభుత్వ అతి జోక్యమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి పర్యటనల విషయంలో మామూలుగానే ఉండాలని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈరోజు తుఫాను బాధితులను పరామర్శించనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు లేకపోవడంతో దానికి ప్రచారం కూడా లేదు. కూటమి ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే.