Anil Kumar Yadav: కొందరు నేతల వైఖరి వింతగా ఉంటుంది. అధికారంలో ఉంటే వారి హావభావాలు వేరు. పవర్ అనే అస్త్రం చేతిలో ఉన్న సమయంలో వారు రెచ్చిపోయే తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. అటువంటి భిన్న స్వరూపం చూపించారు నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav). ఇప్పటికీ ఆయన మాటలు సోషల్ మీడియాలో వింటూనే ఉంటాం. కనీసం ఆయన రూపం రాజకీయ నేతకు దగ్గరగా ఉండదు. ‘పర్సెంటా.. అర పర్సెంటా కాదు బుల్లెట్ దిగిందా లేదా’ అన్నదే కావాలి. ఎందుకన్నా తొందర’ఎందుకన్నా తొందర’ అంటూ అయ్యప్ప మాలలో ఎంత బరితెగించి మాట్లాడారో తెలియంది కాదు. అప్పట్లో మంత్రి హోదాలో అనిల్ కుమార్ యాదవ్ సినిమా డైలాగులు, ప్రత్యర్థులకు హెచ్చరికలు, ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏపీలో కనిపించకుండా మానేశారు. మొన్న ఆ మధ్యన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కలిశారు. సాటి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తెలంగాణలో రాజకీయ పరామర్శలు చేస్తున్నారు. కానీ తన సొంత జిల్లా నెల్లూరు జిల్లా జైలులో ఉన్న జోగి బ్రదర్స్ ను మాత్రం కనీసం పలకరించలేదు. అసలు ఏపీ వైపు తొంగి చూడడం లేదు.
* సీనియర్లకు సైతం..
ఒక్క మాటలో చెప్పాలంటే అనిల్ ప్రవర్తన సొంత పార్టీలో సీనియర్లకు సైతం మింగుడు పడదు. ఒక్క మాటలో చెబుతామంటే ధర్మాన ప్రసాదరావు( dharman Prasad Rao ) మాటలను.. అనిల్ కుమార్ మాటలను ఒక్కసారి బేరిజు వేసుకుందాం. ఎక్కడ ధర్మాన.. ఎక్కడ అనిల్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. పోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను తప్పు పట్టలేరు. అయితే ఇప్పుడు తప్పు పట్టొచ్చు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆపై సంక్లిష్టతను ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో సైతం అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వచ్చు. ఒక్క అనిల్ కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతలు విషయంలో సీనియర్లు సలహా ఇవ్వవచ్చు. ఎందుకంటే అది పార్టీకి ముఖ్యం.. అంతకుమించి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం కాబట్టి.
* ఇద్దరిలో ఎవరు పట్టించుకోవడం లేదు.
అనిల్ కుమార్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడారు. అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. హీటెక్కించే డైలాగులు లేవు. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే మాటలు లేవు. అసలు ఏపీ వైపు చూడడమే లేదు. అప్పుడప్పుడు వచ్చి నెల్లూరు రాజకీయాలపై పొడిపొడిగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కలిసారు. తద్వారా తాను ఎక్కడకు వెళ్లలేదని.. హైదరాబాదులోనే ఉన్నట్లు సంకేతాలు పంపించారు. అంటే ఏపీ రాజకీయాలు వద్దు.. తెలంగాణ ముద్దు అన్నట్టు ఉంటుంది ఆయన పరిస్థితి. మొన్న ఆ మధ్యన ఓ 20 మంది పార్టీ ఇంచార్జ్లను పిలిచి మందలించినట్లు వార్తలు వచ్చాయి. మరి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదా? లేకుంటే జగన్మోహన్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ పట్టించుకోవడం లేదా? అనేది తెలియాల్సి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైనా చెల్లుబాటు అవుతుంది. పార్టీ ఇటువంటి క్లిష్ట సమయంలో ఉంటే అనిల్ కుమార్ ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నట్టు అనేది సొంత పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.