Jagan: గన్నవరం( Gannavaram) నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లిపోతారని కూడా ప్రచారం నడిచింది. అయితే తాజాగా ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. అందుకే గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను వేరే నేతకు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. అందుకే అక్కడ కమ్మ నేత కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఓ మహిళ నేతపై ఆయన ఫోకస్ పెట్టారు. ఆమెను తెచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
* తొలిసారిగా ఎంపీగా
2009 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్( vallabhanani Vamsi Mohan ). జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి హరికృష్ణ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి పలకరించింది. అటు తరువాత గన్నవరం నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019లో మరోసారి గెలిచారు. కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీకి అక్కడ బాధ్యుడు లేకపోవడం లోటు.
* కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం
గన్నవరం.. కమ్మ సామాజిక వర్గం( Khamma community ) ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం. అందుకే అక్కడ బలమైన నేతను బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అక్కడ అభ్యర్థి అవసరం అయ్యారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వల్లభనేని వంశీ టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించడంతో.. అప్పటివరకు అక్కడ వైసిపి బాధ్యతలు చూసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి వచ్చారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వంశీ సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో వైసీపీకి ఇన్చార్జ్ అవసరం అయ్యారు.
* సుంకర పద్మశ్రీ కి ఛాన్స్
ప్రస్తుతం వైసీపీలో ( YSR Congress)సీనియర్ నేతలు ఎవరూ లేరు. యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశి స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అవసరం. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పీసీసీ పీఠం ఆశించారు. కానీ షర్మిల దక్కించుకోవడంతో ఆమెకు నిరాశ ఎదురయింది. ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షురాలు గా ఉన్నారు. కానీ షర్మిల తో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. త్వరలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. గన్నవరం ఇంచార్జ్ బాధ్యతలను అప్పగిస్తానని జగన్ ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.